జిన్నారం ( తెలుగు ప్రభ ): ఎండ కాస్తే భానుడి భగభగలు.. వర్షం కురిస్తే ఆకాశానికి చిల్లులు.. కాలాలు మారినా, ఏళ్లు గడిచినా మారనిది ఒక్కటే—అది ఆ పేద శ్రామికుల ‘పొట్టకూటి’ జీవిత చక్రం! రెక్కాడితే గానీ డొక్కాడని ఆ అభాగ్యులకు వాతావరణంతో సంబంధం లేదు; పొయ్యి వెలగాలంటే పనికి వెళ్లాల్సిందే. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరి గుండెలను పిండేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి కడుపు నింపుకోవడానికి వచ్చే వందలాది మంది అడ్డా కూలీలు, వర్షంలో తడుస్తూనే వీధుల పక్కన పనుల కోసం నిరీక్షిస్తున్నారు.
వర్షంలోనూ వదలని పొట్టకూటి తిప్పలు : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రం చుట్టుపక్కల శ్రామికులకు ప్రధాన అడ్డాగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పల్లెల నుంచి రోజువారీ కూలీలు తెల్లవారకముందే ఇక్కడికి చేరుకుంటారు. భవన నిర్మాణాలు, వ్యవసాయ పనులు, ఇతర దినసరి వేతన పనుల కోసం యజమానులు ఇక్కడికే వచ్చి కూలీలను తీసుకెళ్తుంటారు.
గత మూడు నాలుగు రోజులుగా ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల పనులు దొరకడమే గగనమైపోయింది. అయినప్పటికీ, ఇంట్లో పస్తులుండలేక కూలీలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయమే అడ్డాకు చేరుకుంటున్నారు. పని లభిస్తుందో లేదో తెలియని అనిశ్చితి మధ్య, వర్షంలో తడుస్తూనే రోడ్ల పక్కన వేచి చూస్తున్నారు.
తలదాచుకోవడానికి నీడ లేక తీవ్ర అవస్థలు : గుమ్మడిదలలో కూలీలు గుమిగూడే ప్రధాన కేంద్రాల వద్ద కనీసం నిలబడటానికి కూడా షెల్టర్ (నీడ వసతి) లేకపోవడం శోచనీయం. వర్షం తీవ్రమైనప్పుడు దుకాణాల సందుల్లో, చెట్ల కింద తలదాచుకుందామన్నా తడిసి ముద్దవ్వక తప్పడం లేదు. వర్షంలో గంటల తరబడి తడవడం వల్ల జ్వరాలు, జలుబు వంటి అనారోగ్యాల బారిన పడుతున్నామని కూలీలు వాపోతున్నారు. పని దొరికితే రూ. 400 – 600 మాత్రమే వస్తుందని, పని లేని రోజున వచ్చే దారి ఖర్చులు కూడా నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు, పాలకులకు వినతి: షెల్టర్ నిర్మాణం అత్యవసరం : “మాకు పెద్ద కోరికలేమీ లేవు.. మమ్మల్ని వర్షం, ఎండల నుంచి రక్షించేలా ఒక చిన్న షెల్టర్ కట్టిస్తే చాలు” అని అడ్డా కూలీలు, స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. స్థానిక మున్సిపాలిటీ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి: కూలీలు నిరీక్షించేందుకు వీలుగా ‘కూలీల విశ్రాంతి భవన్’ లేదా సురక్షితమైన షెల్టర్ నిర్మించాలి. తాగునీరు, కనీస పారిశుధ్య వసతులు కల్పించాలి. వాతావరణ అత్యవసర సమయాల్లో శ్రామికులకు భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

