Hyderabad: గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. మంగళవారం అర్థరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో నగర ప్రజలకు ఉక్కపోత నుండి కాస్త ఉపశమనం లభించినట్లయింది.
అధికారుల హెచ్చరిక: తూర్పు హైదరాబాద్ పరిధిలోని కాప్రా, అల్వాల్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిసర ప్రాంతాలతో పాటు ఎల్బీ నగర్, మలక్‌పేట్, హయాత్‌నగర్ వరకు పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం సైతం వర్షం కురుస్తుంది. ఉత్తర హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మేడ్చల్, జీడిమెట్ల, గాజులరామారం, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బాచుపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పశ్చిమ, మధ్య ప్రాంతాలకూ విస్తరిస్తున్న వర్షం: వర్షంతో పాటు తీవ్రమైన ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షం మరికొద్ది గంటల్లో నగరంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన నగరం.. రాత్రికి ఒక్కసారిగా చల్లబడటంతో వాతావరణాన్ని నగరవాసులు ఆస్వాదిస్తున్నారు.

