HomeTop StoriesRains: భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వాన.. శంషాబాద్ జలమయం.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్!

Rains: భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వాన.. శంషాబాద్ జలమయం.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్!

Heavy rains in Hyderabad : నిన్నటి వరకు భగభగలాడిన భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన భాగ్యనగర వాసులను వరుణ దేవుడు ఒక్కసారిగా పలకరించాడు. నగరంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోత వర్షం కురిసింది. అయితే, ఈ తొలకరి పలకరింపు నగరవాసులకు ఉపశమనం కలిగించినప్పటికీ, రోడ్లన్నీ నదులను తలపించడంతో ట్రాఫిక్ కష్టాలు చుట్టుముట్టాయి. ప్రధాన రహదారులన్నీ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. మరీ ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన మార్గంలో వరద నీరు పోటెత్తడంతో జీవన నాడి స్తంభించిపోయింది.

- Advertisement -

జలదిగ్బంధంలో సిటీ.. రోడ్లపై ఈత కొట్టిన వాహనాలు:

శనివారం నగరంలోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. ఐటీ కారిడార్‌లోని మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాలతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. మరోవైపు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అంబర్‌పేట, కాచిగూడ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. దీంతో డ్రైనేజీలు పొంగిపొర్లి వాన నీరు రోడ్లపైకి చేరింది.

అన్నింటికంటే ముఖ్యంగా శంషాబాద్ ప్రధాన రహదారి ఒక మినీ చెరువును తలపించింది. రోడ్డంతా భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు నీటిలోనే ఈదుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది భారీ మోటార్ల సహాయంతో నీటిని తోడేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అటు షాద్‌నగర్ వద్ద బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై సైతం నీరు నిలవడంతో హైవేపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

రంగంలోకి సీఎం రేవంత్.. అధికారులకు ‘హై అలర్ట్’ ఆదేశాలు

నగరంలో నెలకొన్న ట్రాఫిక్ మరియు వరద కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. పరిస్థితులను సమీక్షించిన ఆయన అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని విభాగాల అధికారులు ‘హై అలర్ట్’లో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ట్రాఫిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్, మున్సిపల్ శాఖ (GHMC) అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు (HYDRA), విద్యుత్ శాఖ, వాటర్ బోర్డు అధికారులు అప్రమత్తంగా ఉండి, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగానే సహాయక బృందాలను మోహరించాలని సూచించారు.

నగరంలో నరకం.. పల్లెల్లో పచ్చదనం!

ఒకవైపు హైదరాబాద్ నగరం ట్రాఫిక్ కష్టాలతో సతమతమవుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వరుణుడి రాకతో అన్నదాతల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా చేవెళ్లలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఈసీ వాగు ఉరకలెత్తుతోంది. తొలకరి వర్షాలు పలకరించడంతో రైతులు ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాలను దున్ని విత్తనాలు నాటే పనులను ముమ్మరం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు అంతగా పడకపోవడంతో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News