Cyber Crime Banks Involved: ప్రజాధనానికి భద్రత బ్యాంకులే అంటారు. కానీ ఆ బ్యాంకులే ఆర్థిక నేరాలకు పాల్పడితే.. ఇక ప్రజా సొమ్ముకి సెక్యూరిటీ ఎక్కడుంది. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కై ఏకంగా రూ. 150 కోట్ల ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు బ్యాంకు అధికారులు. దాదాపు 850 కేసులతో లింకులు ఉన్న ఈ భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు.
Also Read: https://teluguprabha.net/national-news/explosion-in-fireworks-factory-in-tamilnadu-18-died/
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్త సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించి, భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భాగంగా 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. 52 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ భారీ నెట్‌వర్క్ ద్వారా దాదాపు రూ. 150 కోట్ల మేర ఆర్థిక మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ స్కాంలో అరెస్టయిన వారిలో 32 మంది బ్యాంక్ అధికారులు ఉండటం పోలీసులనే విస్మయానికి గురిచేసింది. వీరు సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కై, కేవైసీ నిబంధనలను ఉల్లంఘించి నకిలీ ఖాతాలను తెరిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన దాదాపు 850 కేసులతో ఈ ముఠాకు సంబంధం ఉందని తేలింది. ఇందుకోసం సుమారు 350 బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని పోలీసులు గుర్తించారు.
Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-kkr-won-by-4-wickets-against-rr/
డీసీపీ వి. అరవింద్ బాబు పర్యవేక్షణలో 16 ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు ఈ ఆపరేషన్ చేపట్టగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, చెక్ బుక్కులు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు, నకిలీ కంపెనీల స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-1’లోనూ 16 రాష్ట్రాల్లో 117 మందిని అరెస్ట్ చేశారు.

