Homeతెలంగాణహైదరాబాద్GHMC : నరకప్రాయంగా నగర నాలాలు.. ప్రాణాలు బలితీసుకుంటున్న బల్దియా నిర్లక్ష్యం

GHMC : నరకప్రాయంగా నగర నాలాలు.. ప్రాణాలు బలితీసుకుంటున్న బల్దియా నిర్లక్ష్యం

Hyderabad open nala accidents : కోట్లు వెచ్చించి విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వర్షాకాలంలో గ్రేటర్ హైదరాబాద్ వీధుల్లో కనిపిస్తున్న చేదు నిజాలకు అస్సలు పొంతన కుదరడం లేదు! వాన చినుకు పడితే చాలు.. నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీల వెంట ఉండే వరద నాలాలు, మూతల్లేని మ్యాన్‌హోళ్లు మృత్యుకవాటాలుగా మారుతున్నాయి. …

- Advertisement -

మియాపూర్ అండర్‌పాస్ విషాదం: నగరంలో అధికారుల బాధ్యతారాహిత్యం ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో చెప్పడానికి మియాపూర్ వైశాలినగర్ అండర్‌పాస్ వద్ద జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.

గల్లంతైన వృద్ధుడు: గత నెల 29న నాలా మరమ్మతు పనుల్లో భాగంగా తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడి హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన 70 ఏళ్ల బాలయ్య అనే వృద్ధుడు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా, బల్దియా బృందాలు ఈర్ల చెరువు వరకు జేసీబీలతో వ్యర్థాలు తొలగిస్తూ రోజులు తరబడి గాలించినప్పటికీ బాలయ్య ఆచూకీ లభించకపోవడం. ఆయన కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అక్కడ పనులు జరుగుతున్నాయని సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని స్థానికులు మండిపడుతున్నారు.

హైడ్రా’ దోబూచులాట: బాధ్యతల నుంచి బల్దియా పలాయనం : గత రెండేళ్లుగా నగరంలో వరద నాలాల నిర్వహణ తీవ్రంగా దెబ్బతింది. హైడ్రా (HYDRAA) ఏజెన్సీ అమలులోకి వచ్చాక, అత్యవసర ఉపశమన చర్యలు, విపత్తుల నిర్వహణను ఆ సంస్థ చూసుకుంటోందనే వంకతో జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు తమ ప్రాథమిక విధులను పూర్తిగా పక్కనబెట్టేశారు.  నాలాల్లో పూడికతీత, రక్షణ గోడల నిర్మాణం, ఐరన్ గ్రిల్స్/పైకప్పుల ఏర్పాటు పూర్తిగా జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగానిదే. కానీ, రెండు సంస్థల మధ్య సమన్వయ లోపం వల్ల పనులు అటకెక్కాయి. సర్వేల సాకుతో టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదకరమైన సెల్లార్ తవ్వకాలను, శిథిలావస్థకు చేరిన భవనాలను తనిఖీ చేయడం నిలిపివేశారు. ఇటీవల గోపన్‌పల్లి టీఎన్జీవో కాలనీలో జరిగిన సెల్లార్ ప్రమాదం కూడా ఈ నిర్లక్ష్యానికి నిదర్శనం.

గడిచిన దశాబ్ద కాలంలో 30 నిండు ప్రాణాలు బలి : నగరంలో నాలాలు ఏటా ముగ్గురిని బలితీసుకుంటున్నాయనడానికి గడిచిన పదేళ్ల గణాంకాలే స్పష్టమైన ఆధారం.

కన్నీళ్లు పెట్టిస్తున్న వరుస మరణాల పరంపర : నగరంలో నాలాల మృత్యుఘోష నేటిది కాదు.. గడిచిన కొన్నేళ్లుగా జీహెచ్‌ఎంసీ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యం ఎందరో అమాయకుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. 2020 సెప్టెంబరు 17న నేరెడ్‌మెట్ ప్రాంతంలో కురిసిన వర్షానికి 12 ఏళ్ల చిన్నారి సుమేధ ఓపెన్ నాలాలో పడి గల్లంతై మృతి చెందిన దారుణ ఘటన నగర ప్రజల గుండెలను పిండేసింది. ఆ ఘటన తర్వాత అధికారులు ఎన్నో కంటితుడుపు హామీలిచ్చినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడంతో ప్రమాదాల పరంపర అలానే కొనసాగుతోంది.

2025 ఆగస్టులో కర్మన్‌ఘాట్ టీకేఆర్ కమాన్ సమీపంలోని ఉప్పొంగిన నాలాలో పడి సయ్యద్ ఫర్హాన్ అనే వ్యక్తి కొట్టుకుపోగా, అదే ఏడాది సెప్టెంబరు 14న ముషీరాబాద్ నాలాలో పడి దినేశ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. అదే రోజు మెహిదీపట్నం అఫ్జల్‌సాగర్ వరద నాలాలో పడి బావా-బామ్మర్దులైన అర్జున్, రాము కొట్టుకుపోగా, వారి మృతదేహాలు నెల రోజుల తర్వాత మూసీ నదిలో లభ్యమవ్వడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఇక 2025 సెప్టెంబరులోనే యాకుత్‌పురాలో పూడికతీత కోసం తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోగా, స్థానికులు సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి కాపాడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇవే కాకుండా 2019 నుంచి 2023 మధ్య కాలంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఓపెన్ నాలాలు, మూతల్లేని మ్యాన్‌హోళ్ల వల్ల 2023లో ఇద్దరు, 2021లో ముగ్గురు, 2020లో ఇద్దరు, 2019లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏటా వర్షాకాలం రావడం, నాలాలు బలితీసుకోవడం, అధికారులు సమీక్షల పేరుతో హడావుడి చేసి మళ్లీ మర్చిపోవడం పరిపాటిగా మారిందనడానికి ఈ వరుస విషాదాలే సజీవ సాక్ష్యాలు.


ఆదమరిచిన హామీలు.. కన్నీళ్లు పెడుతున్న బాధితులు : 2020లో సుమేధ ఘటన జరిగిన సమయంలో అప్పటి అధికారులు నగరంలోని ప్రతీ ఓపెన్ నాలాకు సేఫ్టీ నెట్లు, పైకప్పులు వేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఆ హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై సరైన చర్యలు తీసుకోకపోవడం, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఈ వరుస మరణాలకు మూలకారణంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News