Hyderabadis: సూర్యకుమార్ సారథ్యంలో భారత టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మల తర్వాత భారత్‌కు పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్‌గా సూర్య రికార్డుల్లోకెక్కాడు. అయితే ఆ విజయతీరాల్లో ఇద్దరు హైదరాబాదీలు ఉండటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా మారింది. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన అనుభవంతో, యువ బ్యాటర్ తిలక్ వర్మ తన దూకుడుతో భారత జట్టు ఘనవిజయంలో కీలక పాత్ర పోషించారు.
మిడిలార్డర్ వెన్నెముక.. తిలక్ వర్మ!: టీమిండియాలో చాలా కాలంగా ఉన్న నాణ్యమైన ఎడమచేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ లోటును 23 ఏళ్ల తిలక్ వర్మ భర్తీ చేశాడు. ఈ టోర్నీలో తిలక్ ఆటతీరు అమోఘం.మొత్తం 9 మ్యాచ్‌ల్లో 154.47 స్ట్రైక్ రేటుతో 207 విలువైన పరుగులు సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేయడమే కాకుండా.. వికెట్లు పడుతున్నప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంలో పరిణతి చూపాడు. ఒక్క దక్షిణాఫ్రికా మ్యాచ్ మినహా మిగిలిన అన్ని సందర్భాల్లోనూ తిలక్ జట్టుకు అండగా నిలిచాడు.
Also read-T20 World Cup: రిటైర్మెంట్ వార్తలపై సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ!
అంకితభావానికి నిదర్శనం సిరాజ్: టోర్నీలో సిరాజ్‌కు ఎక్కువ అవకాశాలు రాకపోయినప్పటికీ వచ్చిన ఒక్క అవకాశాన్ని అద్భుతంగా మలుచుకున్నాడు. హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్యంగా సిరాజ్‌కు పిలుపు వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న సిరాజ్, పిలుపు వచ్చిన 24 గంటల్లోపే ముంబయి చేరుకుని అక్కడి నుంచి అమెరికా మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 3/29 గణాంకాలతో సత్తా చాటి తాను ఎప్పుడూ సిద్ధమేనని నిరూపించుకున్నాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఈ ప్రపంచకప్ విజయంలో సిరాజ్, తిలక్ వర్మలు భాగస్వాములు కావడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

