Kondapur: హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా దూసుకుపోతున్న హైడ్రా (HYDRAA) తాజాగా కొండాపూర్ పరిధిలో మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనగూడ వెళ్లే మార్గంలో ఉన్న విలువైన భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించింది.
కుంటను పూడ్చి ప్లాట్లు చేసిన కబ్జాదారులు: స్థానిక జంగమోనికుంటకు చెందిన సుమారు 4 ఎకరాల భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో కుంటను మట్టితో పూడ్చివేసి ప్లాట్లుగా మార్చారు. ఈ భూమిని విక్రయించి కోట్లాది రూపాయలు దండుకోవాలనే పథకంతో అమ్మకానికి సైతం సిద్ధం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ భూమి విలువ దాదాపు రూ. 700 కోట్లు ఉంటుందని హైడ్రా అంచనా వేసింది.
Also read-Hyderabad: భాగ్యనగర వాసులకు అలర్ట్.. 40 గంటల పాటు తాగునీటి నిలిపివేత!
అధికారుల కొరడా: ఈ ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ మరియు హైడ్రా అధికారులు తక్షణమే స్పందించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు కుంట చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ చర్యతో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హైడ్రా మరోసారి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

