HYDRAA Gandhamguda: అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ. వేల కోట్ల విలువైన భూమిని ఆక్రమణదారుల బారి నుంచి కాపాడింది. బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసి.. చెరువులను పునరుద్ధరించింది. పార్కులను పునర్నిర్మించింది. ఇటీవల హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వందల కోట్ల విలువైన భూములను కబ్జాల బారి నుంచి కాపాడిన హైడ్రా.. తాజాగా మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది.
Also Read: https://teluguprabha.net/telangana/rahul-gandhi-says-he-is-ready-to-take-over-as-prime-minister/
హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌కు సమీపంలోని గంధంగూడలో సుమారు రూ. 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. మొత్తం 6.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 86/పి లో ఉన్న 6.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ల్యాండ్‌ను సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలోనే జలమండలికి కేటాయించింది.
అయితే, రూ. కోట్ల విలువ చేసే ఈ స్థలంపై కన్నేసిన కొందరు అక్రమార్కులు రకరకాల పేర్లతో ఆక్రమణలకు పాల్పడ్డారు. మరోవైపు ఆ స్థలంలో అనధికారికంగా షెడ్లను కూడా నిర్మించి కబ్జాలు చేశారు. ఈ విషయంపై జలమండలి అధికారులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా.. మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పక్కాగా సర్వే చేపట్టింది.
ఇది ప్రభుత్వ భూమేనని నిర్ధారించుకున్న అనంతరం.. హైడ్రా అక్కడ వెలసిన అక్రమ నిర్మాణాలను, షెడ్లను కూల్చివేసింది. ఆక్రమణలన్నీ తొలగించిన తర్వాత మొత్తం 6.30 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కబ్జాదారులకు గట్టి షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో ఆక్రమణలకు తావులేకుండా ఇది ప్రభుత్వ స్థలం అని స్పష్టం చేస్తూ హైడ్రా హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసి భూమిని కాపాడింది.

