- కాలనీలో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
కీసర (తెలుగుప్రభ): ప్రజల ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కులు, ఓపెన్ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతాయని, పిల్లలు ఆటలాడుకునేందుకు సురక్షితమైన స్థలం, యువతతో పాటు పెద్దలు కూడా వ్యాయామం చేసుకునేందుకు అనువైన వసతులు అందుబాటులోకి రావడం సంతోషకరమని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తెలిపారు. కీసర డివిజన్ పరిధిలోని చీర్యాల గ్రామంలోని జిన్నారం కాలనీలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్‌ను ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కాలనీ ప్రజలు, స్థానిక నాయకులతో కలిసి ఆయన కాలనీలో పర్యటించి, ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు గత 18 సంవత్సరాలుగా జిన్నారం కాలనీలో సరైన మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా తాగునీటి సమస్య, శ్మాశనవాటిక, రేషన్ షాపు ,అంగన్ వాడీ కేంద్రం వంటివి ప్రధాన మౌలిక వసతులు లేకపోవడంతో స్థానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నామంటూ ఈటల రాజేందర్ కు విన్నవించారు.
సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతా.. ఎంపీ ఈటల రాజేందర్
కాలనీ ప్రజలు వివరించిన సమస్యలను ఎంపీ ఈటల రాజేందర్ శ్రద్ధగా విన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, అంగన్‌వాడీ కేంద్రం, శ్మశానవాటిక, రేషన్ షాపు వంటి ప్రధాన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన శాఖల అధికారులతో చర్చించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమ సమస్యలను ఎంపీ నేరుగా తెలుసుకోవడం పట్ల జిన్నారం కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ అధ్యక్షులు కోల బలరాజ్ యాదవ్, చీర్యాల మాజీ ఉపసర్పంచ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లాల తిరుమల రెడ్డి, చీర్యాల మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏలూరు సత్యనారాయణ ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు డొంకెనీ శాలిని రమేష్ గౌడ్, బర్లపాటి ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు కోల మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, జిన్నారం కాలనీ అధ్యక్షులు సంపత్ గుప్త, దినేశ్ రెడ్డి, జిన్నారం వేణు, కిరణ్, మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.



