సికింద్రాబాద్ (తెలుగుప్రభ): స్వదేశీ పర్యావరణహిత బ్లోయింగ్ ఏజెంట్ సాంకేతికత అభివృద్ధికి హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం జూలై 8న తిరువనంతపురంలోని వీఎస్‌ఎస్‌సీలో ఇరు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా అధునాతన వ్యూహాత్మక అవసరాలకు అనువైన, పర్యావరణానికి మేలు చేసే స్వదేశీ బ్లోయింగ్ ఏజెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేయనున్నారు. ఫ్లోరోకెమికల్ సంశ్లేషణ, ప్రాసెస్ అభివృద్ధిలో ఐఐసీటీకి ఉన్న నైపుణ్యాన్ని, వీఎస్‌ఎస్‌సీ సాంకేతిక అవసరాలు, మూల్యాంకన సామర్థ్యాలతో అనుసంధానించి ఈ పరిశోధన చేపట్టనున్నారు.
Also Read: Security : కొడంగల్ కోటలో కట్టుదిట్టమైన కాపలా… కర్తవ్య నిర్వహణలో కదం తొక్కాలన్న ఎస్పీ స్నేహ మెహ్రా!
ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనకు తోడ్పాటు..
ఈ సందర్భంగా ఐఐసీటీ డైరెక్టర్ డా. డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా తదుపరి తరం పర్యావరణహిత ఫ్లోరోకెమికల్ సాంకేతికత అభివృద్ధి వేగవంతమవుతుందని, దిగుమతులపై ఆధారపడటం తగ్గి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు తోడ్పాటునందిస్తుందని తెలిపారు. వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ డా. రాజీవ్ యూ.పీ. మాట్లాడుతూ, అన్‌హైడ్రస్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ నిర్వహణలో ఐఐసీటీకు ఉన్న ప్రత్యేక పరిశోధనా సామర్థ్యం ఈ ప్రాజెక్టు విజయానికి దోహదపడుతుందని చెప్పారు. ఈఐసీటీ శాస్త్రవేత్త డా.పున్నా నాగేందర్ మాట్లాడుతూ.. హైడ్రో ఫ్లోరోఒలిఫిన్స్ ఆధారిత బ్లోయింగ్ ఏజెంట్లు ఓజోన్ పొరకు హాని చేయకుండా, అత్యల్ప గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం పెరుగుతోందన్నారు. ఈ పరిశోధన విజయవంతమైతే అధునాతన ఫ్లోరోకెమికల్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడంతో పాటు వాణిజ్యీకరణకు కూడా మార్గం సుగమం కానుంది.

