చార్మినార్(తెలుగు ప్రభ): హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ స్వాతంత్య్ర సాధన కోసం ప్రాణాలర్పించిన సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పించారు. ఈ వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అంకితభావం, విశేష ప్రతిభ కనబరిచిన 72 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి సీపీ సజ్జనర్ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
సిబ్బందిని ప్రశంసించిన సీపీ సజ్జనర్: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న పలు నూతన చర్యలను సీపీ సజ్జనర్ వివరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఆహార కల్తీని సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేకంగా ‘హెచ్-ఫాస్ట్’ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో కల్తీదారులపై జీరో టాలరెన్స్ విధానంతో వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రలతో పాటు ఇటీవల ముగిసిన చారిత్రక ఆషాఢ బోనాల ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసేలా అహర్నిశలు శ్రమించిన సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
సైబర్ నేరాల కట్టడి: సైబర్ నేరగాళ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ‘ఆపరేషన్ ఆక్టోపస్’ ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన ‘సీ-మిత్ర’ వర్చువల్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 1,700కి పైగా జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ఫిర్యాదుల నమోదుకు ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్ ఎంతగానో తోడ్పడుతోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ‘స్పందన – తక్షణ రక్షణ’ మహిళా రెస్పాండర్ వ్యవస్థ రోజుకు సగటున 30 ఫిర్యాదులను స్వీకరిస్తూ సత్వర సేవలు అందిస్తోందని తెలిపారు. త్వరలోనే 300 మంది మహిళా సిబ్బందికి డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్లు వెల్లడించారు. నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ‘హెచ్-న్యూ’ విభాగాన్ని మరింత బలోపేతం చేశామని, డ్రగ్స్ విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే, టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డీసీపీ కె.వెంకట లక్ష్మి, అదనపు డీసీపీ బి.కిష్టయ్యలతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

