Homeతెలంగాణహైదరాబాద్Bikes Theft: అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు.. 9 బైక్‌లు స్వాధీనం

Bikes Theft: అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు.. 9 బైక్‌లు స్వాధీనం

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): అంతర్రాష్ట్ర స్థాయిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను మార్కెట్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం 9 చోరీ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు కొనసాగుతోంది.

- Advertisement -

పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 21న రాత్రి సికింద్రాబాద్‌లోని పంచవటి లాడ్జ్ ఎదుట పార్క్ చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వేణుగోపాల్‌కు చెందిన బైక్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 150కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు.

దర్యాప్తులో భాగంగా శనివారం అల్ఫా హోటల్ సమీపంలో ప్రధాన నిందితుడు బొంత యాదగిరి అలియాస్ గిరిను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, దమ్మాయిగూడకు చెందిన హుస్సేన్ బాష్యాతో కలిసి పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు.

నిందితులు రాత్రి వేళల్లో బైక్‌లను చోరీ చేసి, దమ్మాయిగూడలోని ఓ ఖాళీ స్థలంలో దాచేవారని పోలీసులు తెలిపారు. సుమారు 40 నుంచి 50 బైక్‌లను ఒకేచోట జమ చేసి ఇతర రాష్ట్రాల్లో విక్రయించాలని యోచించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల సమాచారం మేరకు దమ్మాయిగూడలోని స్థావరంపై దాడి చేసి 9 చోరీ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న పాందిరి ఉపేందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన మార్కెట్ ఇన్‌స్పెక్టర్ జి. రామకృష్ణ, డీఐ నరేష్, నేర విభాగ సిబ్బందిని మల్కాజిగిరి ఏసీపీ వై. యాదగిరిరెడ్డి అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News