Homeతెలంగాణహైదరాబాద్Kavitha : బీసీ బిల్లు ఆమోదించకపోతే ఢిల్లీని ముట్టడిస్తాం.. కేంద్రానికి కవిత తీవ్ర హెచ్చరిక

Kavitha : బీసీ బిల్లు ఆమోదించకపోతే ఢిల్లీని ముట్టడిస్తాం.. కేంద్రానికి కవిత తీవ్ర హెచ్చరిక

ఎల్బీనగర్​ (తెలుగుప్రభ) : బీసీ రిజర్వేషన్ల బిల్లును వచ్చే బడ్జెట్‌ సమావేశాల లోపే ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలని, లేకపోతే వెయ్యి కార్లతో ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడతామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. గురువారం సరూర్‌నగర్‌లోని ఇండోర్​ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’ లో ఆమె ప్రసంగించారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ సంకల్ప సభ దేశంలోని కోట్లాది మంది జీవితాల్లో మార్పుకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు.

- Advertisement -


సామాజిక న్యాయం అంటే ఎవరి హక్కులు లాక్కోవడం కాదని, సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు కల్పించడమేనని కవిత అన్నారు. తాను బీసీల గురించి మాట్లాడితే అగ్రవర్ణంలో పుట్టిన వ్యక్తిగా విమర్శలు చేస్తున్నారని, అయితే తన పుట్టుక తన చేతిలో లేకపోయినా ఎవరి కోసం పనిచేయాలనేది మాత్రమే తన నిర్ణయమని చెప్పారు. గ్రామ పంచాయతీ ముఖం కూడా చూడని వెనుకబడిన కులాల సాధికారత కోసం జీవితాన్ని అంకితం చేస్తానని తెలిపారు. కుల వివక్ష పూర్తిగా అంతరించేవరకు సామాజిక న్యాయ ఉద్యమం కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో సామాజిక మార్పులకు అగ్రవర్ణాల్లోని ప్రజాస్వామ్యవాదులు కూడా కీలక పాత్ర పోషించారని కవిత గుర్తు చేశారు. గౌతమ బుద్ధుడు, సాహూ మహారాజ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, జయలలిత లాంటి నాయకుల నిర్ణయాలను ఉదాహరణగా ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ, ముస్లిం, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, వికలాంగులు సహా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ముస్లింలకు హక్కులతో కూడిన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సభలో 11 కీలక తీర్మానాలను ఆమోదించారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త ఉద్యమం చేపట్టడం, మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతులకు భారతరత్న ప్రదానం చేయడం, ప్రొఫెసర్ జయశంకర్‌కు పద్మవిభూషణ్ ప్రకటించి ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయడం, ఎస్సీ–ఎస్టీ నిధులను వారి సంక్షేమానికే వినియోగించడం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయడం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఆదివాసీలకు అటవీ హక్కులు, ముస్లింల ఆర్థిక సాధికారత, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News