Advocate Murder hyderabad: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌కి చెందిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి లభించింది. హత్య ఉదంతంలో ఐదుగురు నిందితులను గుర్తించారు. ఈ మేరకు మర్డర్‌కి వాడిన స్కార్పియో వాహన యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్యలో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నంబర్ ప్లేట్ లేని స్కార్పియో కారుతో న్యాయవాదిని ఢీకొట్టి నిందితులు పరారయ్యారు. ఆ వాహనాన్ని గుర్తించిన పోలీసులు, దాని యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితులు ముందస్తు ప్రణాళికతోనే గత మూడు రోజులుగా అడ్వకేట్ ఖాజా కదలికలపై రెక్కీ నిర్వహించి ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
Also Read: https://teluguprabha.net/national-news/suicide-attack-on-zafar-express/
కాగా, నెలల క్రితమే కారు అమ్మేసినట్లు స్కార్పియో యజమాని పోలీసులకు తెలిపారు. అయితే కొన్నవారు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని చెప్పగా.. గుర్తుతెలియని వ్యక్తులే కారు కొన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారుల అడ్రస్ కోసం ఆరా తీస్తున్నట్లు చెప్పారు. హత్యకు వాడిన వాహనం, నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: https://teluguprabha.net/telangana/ktr-ghmc-election-sketch/
హత్య నేపథ్యం
వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ సుదీర్ఘంగా పోరాటం చేస్తుండటమే ఈ హత్యకు ప్రధాన కారణమని సమాచారం. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్ వద్ద తన ఇంటి బయట ఖాజా మొయినుద్దీన్ కారు ఎక్కుతుండగా, నిందితులు వేగంగా స్కార్పియో కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. న్యాయవాదుల రక్షణ కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకురావాలని, ఈ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని లాయర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

