సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ, ప్రజల పక్షాన పోరాటాలను ఉధృతం చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ మహంకాళి-సికింద్రాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం సికింద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
హామీలన్నీ నీటిమూటలే – కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి నిప్పులు : సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ప్రజలకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత కొన్ని నెలల పాలనలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. “పదేళ్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడితే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 66 హామీలు ప్రస్తుతం నీటిమూటలుగా మారాయి” అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల నేడు రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు మరియు ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణపై నిఘా ఉంచాలి : ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితాయే పునాది అని గుర్తుచేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీజేపీ బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) బాధ్యత తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి సవరణల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SSR) ప్రక్రియకు అధికార పార్టీ అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆయన విమర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు శ్రీరామరక్షగా నిలిచాయని కొనియాడారు.
గ్రేటర్ బీజేపీ బలోపేతానికి పిలుపు – ఎన్. రాంచందర్‌రావు : ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.

