చార్మినార్ (తెలుగు ప్రభ): భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు చివరి వారానికి చేరుకున్నాయి. రేపు(ఆగష్టు 9 ఆదివారం) లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల జాతరతో నగరంలో బోనాల సందడి ముగియనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు.
రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే పాతబస్తీ లాల్ దర్వాజ శ్రీ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఇ. శ్రీనివాస్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు రంగ రమేష్ గౌడ్, ఎ.మాణిక్ ప్రభు గౌడ్, బంగ్లా రాజు, పోసాని విజయ్ కుమార్, సి.వెంకటేష్, కె. రవిరాజుల ఆధ్వర్యంలో భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది 118వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ బంగారు బోనం సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ఒడి బియ్యం ఇవ్వనున్నారు.

పలు ఆలయాలకు పట్టు వస్త్రాల సమర్పణ
అదేవిధంగా ఉప్పగూడ శ్రీ మహంకాళి దేవాలయంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, సుల్తాన్ షాహి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గౌలిపుర శ్రీ మహంకాళి దేవాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి, మురాద్ మహల్ నల్లపోచమ్మ దేవాలయంలో డాక్టర్ బండ ప్రకాష్, రాంభక్షీబండలోని బంగారు మైసమ్మ దేవాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సుల్తాన్ షాహి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సిబిఐ క్వార్టర్స్ నల్ల పోచమ్మ దేవాలయంలో ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, అలాయాబాద్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో ఉప సభాపతి జాటోత్ రామచంద్ర నాయక్, ఆలీజా కోట్ల మహంకాళి దేవాలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించనున్నారు.
వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు
వీరితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సినీ నటులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో బలిహరణ కార్యక్రమము, 6 గంటలకు అమ్మవారికి మహాభిషేకం జరుగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొని, అమ్మవారికి మహాభిషేకం అనంతరం తొలి బోనం సమర్పించనున్నారు. రాత్రి 8 గంటలకు ప్రపంచ శాంతిని కోరుతూ దేవాలయం వేదికపైన అన్నంతో చేసిన లింగానికి ఉత్సవ విగ్రహానికి శాంతి కళ్యాణం జరుగనుంది. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల వేడుకను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

