Homeతెలంగాణహైదరాబాద్Lal Darwaza Bonalu: లాల్ దర్వాజా బోనాలకు రూ.25 లక్షలు కేటాయించాలి.. సిట్ విచారణ జరిపించాలి

Lal Darwaza Bonalu: లాల్ దర్వాజా బోనాలకు రూ.25 లక్షలు కేటాయించాలి.. సిట్ విచారణ జరిపించాలి

  • లాల్ దర్వాజా సింహావాహిని శ్రీ మహంకాళి టెంపుల్ ట్రస్ట్ కార్యదర్శి జి. అరవవింద్ కుమార్ గౌడ్

చార్మినార్ (తెలుగు ప్రభ): లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ 2026-2027 బోనాల ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ఈ. శ్రీనివాస్ రావుకు అప్పగించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు లాల్ దర్వాజా సింహావాహిని శ్రీ మహంకాళి టెంపుల్ ట్రస్ట్ కార్యదర్శి జి. అరవింద్ కుమార్ గౌడ్, ఆలయ మాజీ చైర్మన్ బద్రీనాథ్ గౌడ్, ఆలయ కమిటీ ప్రతినిధి రంగ హరినాథ్ గౌడ్‌లు తెలిపారు. ఆదివారం లాల్ దర్వాజాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని వివరాలు వెల్లడించారు. ఎన్నో దశాబ్దాలుగా స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ, భక్తుల సహకారంతో విరాళాలు, ఆలయ హుండీ ఆదాయం ద్వారా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే, ప్రస్తుతం దేవాదాయ శాఖ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ నిధులను వినియోగించకుండా, స్థానిక ప్రజల నుంచే విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తుండటం విచారకరమన్నారు. ఈ విధంగా కొనసాగితే బోనాల ఉత్సవాలను గత సంప్రదాయాలకు అనుగుణంగా అత్యంత వైభవంగా నిర్వహించడం కష్టతరమవుతుందన్నారు. దీనివల్ల ఆలయ ప్రతిష్ఠకే కాకుండా ప్రభుత్వ ప్రతిష్ఠకు కూడా భంగం వాటిల్లే అవకాశం ఉందని, అందువల్ల ఈ ఏడాది బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం దేవాదాయ శాఖ వెంటనే రూ. 25 లక్షలు విడుదల చేయాలని, అలాగే లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ బోనాల సంప్రదాయాలను యథాతథంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బోనాల ఉత్సవాలు ప్రారంభం అయినప్పటికీ ఆలయం పరిసర ప్రాంతాల్లో తగిన విద్యుత్ అలంకరణలు (లైటింగ్) ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదన్నారు. అలాగే తరతరాలుగా బోనాల ఉత్సవాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంప్రదాయ కుటుంబాలకు చెందిన పోతురాజులు, రంగం కార్యక్రమం నిర్వహించే కుటుంబాలు, వృత్తిదారులకు ఇప్పటివరకు ఎండోమెంట్ అధికారులు ఎలాంటి అడ్వాన్స్ చెల్లించకపోవడం భాద్యతారహితం అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో గత పదేళ్లుగా సర్వసభ్య సమావేశంలో సరైన ఆదాయ వ్యయ లెక్కలు సమర్పించలేదని, అదేవిధంగా దేవాదాయ శాఖ నుండి ఆలయానికి అందిన ఆర్థిక సహాయం కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో లెక్కల్లో చూపబడలేదనే అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. అలాగే ఆలయంలోని వెండి, బంగారు ఆభరణాల దుర్వినియోగం, నా దివంగత తండ్రి జి. మహేష్ కుమార్ గౌడ్ ఒక భక్తురాలి వద్ద నుంచి డబ్బు స్వీకరించారంటూ కూడా నిరాధార ఆరోపణలు చేశారని, అందువల్ల ఈ ఆరోపణలన్నింటి పైనా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కోట్లాది భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక భావోద్వేగాలకు ప్రతీక కావడంతో, నిజానిజాలు వెలుగులోకి రావడం అత్యంత అవసరమని, లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఎండోమెంట్ అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: Retirement : 37 ఏళ్ల ప్రస్థానం.. ఉప్పల్ ట్రాఫిక్ ఎస్‌ఐ పూసపల్లి ముత్తయ్యకు ఘన నీరాజనం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News