Homeతెలంగాణహైదరాబాద్Bonalu : లాల్‌దర్వాజాలో బోనాల నవరాత్రులు.. ఉత్సవాలను ప్రారంభించిన నగర పోలీస్​ కమిషనర్

Bonalu : లాల్‌దర్వాజాలో బోనాల నవరాత్రులు.. ఉత్సవాలను ప్రారంభించిన నగర పోలీస్​ కమిషనర్

చార్మినార్​ (తెలుగు ప్రభ) : తెలంగాణ సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు పాతబస్తీలో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. చారిత్రక నేపథ్యం కలిగిన భాగ్యనగర పాతబస్తీ వీధులన్నీ అమ్మవారి నామస్మరణలతో మారుమోగుతున్నాయి. లాల్‌దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం కేంద్రంగా వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల శబ్దాల నడుమ 118వ వార్షిక బోనాల నవరాత్రి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

- Advertisement -

తెలంగాణలో ప్రసిద్దిచెందిన లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్చారణలతో మంగళవాయిద్యాల నడుమ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాతబస్తీలో చారిత్రాత్మక నేపధ్యం కలిగిన లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళిదేవాలయం, బంగారుమైసమ్మదేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళిదేవాలయం, సుల్తాన్​షాహి శ్రీ జగదాంబ దేవాలయం, బేళా ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా కోటమైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ కనకదుర్గ ఆలయం, దేవి దేవాలయం, అలియాబాద్​ శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, మేకల్​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయాలలో శిఖరపూజ, ధ్వజా రోహణ, కలశస్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు.

లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలను ప్రారంభించిన నగర పోలీస్​ కమిషనర్​ విసి సజ్జనర్ : ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా లాల్​దర్వాజా శ్రీసింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించిన నగర పోలీస్ కమిషనర్​ విసి సజ్జనర్ , జీహెచ్​ ఎంసి జోనల్ కమిషనర్​ సత్యనారాయణ,ఆడీషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్​ డీసీపీ కిరణ్ ఖర్రే , జీహెచ్​ఎంసి చార్మినార్​ జోనల్​ కమిషనర్​ సత్యనారాయణతో కలిసి 118వ బోనాల వార్షికోత్సవాలను ప్రారంభించారు.

lal darwaja bonalu

అంతకుముందు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆలయానికి విచ్చేసిన పోలీస్ కమిషనర్ సజ్జనర్, ఆడీషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖర్రే లకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉదయం శిఖరపూజ, ధ్వజా రోహణంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటి తరపున మాజీ చైర్మన్​ మాణిక్​ప్రభు గౌడ్​ కుటుంబం తొలి బోనం సమర్పించింది.

బోనాలను శాంతియుతంగా జరుపుకోవాలి…. – సీపీ విసి సజ్జనర్ : నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ లాల్‌దర్వాజా ఆలయ ఘనమైన చరిత్రను గుర్తు చేస్తూ.. గత 120 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని వివరించారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఆయన తెలిపారు. లాల్‌దర్వాజా బోనాలను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్‌అండ్ బి తదితర శాఖలతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించామన్నారు. సౌత్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు.

2 వేల మందితో భారీ పోలీస్ బందోబస్తు : అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్‌లు, జేబు దొంగతనాలు జరగకుండా క్రైమ్ విభాగం, ‘షీ టీమ్స్’ ద్వారా 24 గంటలూ ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని వివరించారు.. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, సంతోషకరమైన వాతావరణంలో జరిగేలా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్​, ఛత్రినాక ఇన్​స్పెక్టర్​ కోటేశ్వర్ రావు , శాలిబండ ఇన్​స్పెక్టర్​ మహేష్​ గౌడ్​, మొఘల్​పురా ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​, ఆలయ కమిటీ మాజీచైర్మన్​లు సి. వెంకటేష్, జె.లక్ష్మీనారాయణ గౌడ్​, కే. వెంకటేష్, ఎ.మాణిక్​ ప్రభు గౌడ్​, బంగ్లా రాజు, జి.రాజ్​కుమార్​ యాదవ్, సీర రాజ్​కుమార్​, కె.విష్ణు గౌడ్​,బల్వంత్ యాదవ్, తిరుపతి నర్సింగ్​ రావు, ఆలయ ట్రస్టీ ప్రధాన కార్యదర్శి జి. అరవింద్ కుమార్ గౌడ్, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎ.చంద్రకుమార్​, ఎ.వినోద్​ కుమార్​, శేషునారాయణ,విఠల్​​, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News