Homeతెలంగాణహైదరాబాద్Mahankali temple: భక్తులతో కిక్కిరిసిన మహంకాళి ఆలయం.. బోనాలతో పోటెత్తిన భక్తజనం

Mahankali temple: భక్తులతో కిక్కిరిసిన మహంకాళి ఆలయం.. బోనాలతో పోటెత్తిన భక్తజనం

సికింద్రాబాద్‌ (తెలుగు ప్రభ): ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారికి ఒడిబియ్యం బోనాలు సమర్పించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారా యి. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకు ని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను తలపై ఎత్తుకుని ఆలయానికి తరలివచ్చారు. బోనాలకు ప్రత్యే క పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మొక్కుకున్నారు.

- Advertisement -

Also Read: BJP Protest: ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’లో భాగంగా సంతకాల సేకరణ

ఘటం.. పోతరాజుల సందడి…

అమ్మవారి ఘటం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఘటం ఊరేగింపు సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో స్వాగ తం పలికారు. పోతరాజుల ఆట పాటలు, డప్పుల మోత, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. పోతరాజులు సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. ఘటం వెంట భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

బోనాలతో మహిళల సందడి

అమ్మవారికి బోనాలు సమర్పించేం దుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తలపై బోనాలు పెట్టుకుని, నెత్తిన పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనాలతో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. బోనాల ఊరేగింపుల్లో డప్పుల మోత, సంప్రదాయ నృత్యాలు, భక్తుల నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. చిన్నారులు, యు వత, వృద్ధులు సైతం ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఆలయ పరిసరాల్లో భారీ రద్దీ

బోనాలు సమర్పించేందుకు భక్తు లు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందిం చేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

భక్తి, సంప్రదాయాల కలయిక

ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలకు తెలంగాణలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

సీఎం సతీమణి గీతారెడ్డి పూజలు

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని శుక్రవారం రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, ఇతర సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గీతారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తన మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అమ్మవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News