మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ సమర శంఖం
మంగళ్‌పల్లిలో తాత్కాలికంగా కొనసాగుతున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ సందర్శన
విద్యార్థుల పక్షాన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి గళం
శాశ్వత భవనం నిర్మాణానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ
బడంగ్ పేట్, ( తెలుగు ప్రభ ) : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంగళ్‌పల్లిలో భారత్ కాలేజీలో తాత్కాలికంగా కొనసాగుతున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని మాజీ మంత్రులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో నెలకొన్న మౌలిక వసతుల కొరత, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరాలు సేకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు.
అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన శాశ్వత ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాన్ని త్వరితగతిన నిర్మించాలని విద్యార్థులు కోరారు. మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నాయకులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యలపై స్పందించిన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి.. వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, ఇతర బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

