సికింద్రాబాద్ (తెలుగుప్రభ) : మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పౌర సదుపాయాలను మెరుగుపరచడం, స్వచ్ఛతను పెంపొందించడమే లక్ష్యంగా కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగానే మౌలాలి సర్కిల్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ, జేజే నగర్, నిర్మలానగర్ ఎక్స్ రోడ్, సైనిక్‌పురి ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ఆయన సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్యం, నిర్మాణ వ్యర్థాలు (C&D), పట్టణ ప్రణాళిక, పచ్చదనం పరిరక్షణ వంటి అంశాలపై అధికారులకు కంటితుడుపు చర్యలు కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించేలా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పారిశుద్ధ్యం పడకేస్తే సహించేది లేదు : నగర వీధుల్లో అపారిశుద్ధ్యానికి తావులేకుండా నిరంతరం శ్రమించాలని కమిషనర్ స్పష్టం చేశారు. హోటళ్ల వద్ద తప్పనిసరిగా తడి, పొడి చెత్త డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని, రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తను వెంటనే యుద్ధప్రాతిపదికన తొలగించాలని సూచించారు. ముఖ్యంగా చికెన్, కూరగాయలు, కొబ్బరి వ్యర్థాలను రోడ్లపై వేయకుండా శాస్త్రీయంగా నిర్వహించే పద్ధతులను అమలు చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ ఆటోలకు అనుసంధానం కాని గృహాలను వెంటనే గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సి & డి వ్యర్థాల తరలింపునకు ‘ఆక్యుపెన్సీ’ ముడి : నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల (C&D) నిర్వహణపై కమిషనర్ ఒక వినూత్న విధానాన్ని ప్రకటించారు. రహదారుల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను సంబంధిత యజమానులతోనే సొంత ఖర్చులతో తొలగింపజేయాలని, ఒకవేళ యజమానులు స్పందించకపోతే కార్పొరేషన్ ద్వారా వాటిని తొలగించి, ఆ ఖర్చును వారి నుంచే వసూలు చేయాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) జారీ చేసే ప్రక్రియను, వారు సి&డి వ్యర్థాలను అధీకృత పునరుత్పాదక కేంద్రాలకు తరలించారనే ధ్రువీకరణ పత్రంతో ముడిపెట్టాలని పట్టణ ప్రణాళికా విభాగానికి కీలక ఆదేశాలిచ్చారు. రహదారులను ఆక్రమించి నిర్మించిన సిమెంట్ ర్యాంపులను తక్షణమే తొలగించి, రోడ్లను క్రమబద్ధీకరించాలని సూచించారు.
పచ్చదనం పెంపునకు పట్టాలెక్కనున్న ప్రణాళిక: నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అర్బన్ బయోడైవర్సిటీ (UBD) విభాగం సమర్థవంతంగా పనిచేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. డివైడర్లలోని ప్లాంటర్ బాక్స్‌లలో పెరిగిన కలుపు మొక్కలను ఏరివేసి, వాటి స్థానంలో అలంకార నీడనిచ్చే మొక్కలను నాటాలని సూచించారు. నాటిన ప్రతి అవెన్యూ మొక్క సంరక్షణ బాధ్యతను పర్యవేక్షిస్తూ వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగర పరిశుభ్రత, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుదలలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి దిశానిర్దేశం చేశారు.

