Homeతెలంగాణహైదరాబాద్HYDRAA: హైడ్రాకు హాట్సాఫ్‌.. కొనసాగించాలంటూ హైదరాబాద్‌లో భారీ ర్యాలీలు

HYDRAA: హైడ్రాకు హాట్సాఫ్‌.. కొనసాగించాలంటూ హైదరాబాద్‌లో భారీ ర్యాలీలు

Massive rallies held in Hyderabad to support for Hydra: హైదరాబాద్ నగరంలో వరద నివారణ, చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’కు భారీ ప్రజా మద్దతు వెల్లువెత్తింది. చెరువుల సుందరీకరణ, అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై హైడ్రా తీసుకుంటున్న నిర్ణయానికి మద్ధతు తెలిపారు. హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ పలు కాలనీల సంక్షేమ సంఘాలు భారీ ర్యాలీలు నిర్వహించాయి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ, హైడ్రా కమిషనర్‌కు సంఘీభావం తెలిపాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన అమీర్‌పేట, మధురానగర్, శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లోని శ్రీనివాస నగర్ వెస్ట్, వెంగల్ రావు నగర్, మధుర నగర్ సహా అనేక కాలనీ సంక్షేమ సంఘాలు ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. హైడ్రాపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతూ, ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Also Read: Lal Darwaza Bonalu: లాల్ దర్వాజా బోనాలకు రూ.25 లక్షలు కేటాయించాలి.. సిట్ విచారణ జరిపించాలి

రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ఆస్తులు పరిరక్షించిన హైడ్రా..

కాగా, గత రెండేళ్లలో హైడ్రా అనేక విజయాలు సాధించిందని గుర్తు చేవారు. హైడ్రా ఇప్పటివరకు సుమారు 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడిందని, దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించిందని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. హైడ్రా ఆధ్వర్యంలో రెండు విడతల్లో 20 చెరువులను పునరుద్ధరించి ఆయా ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా తొలగించడాన్ని ప్రశంసించారు. ఒకప్పుడు చిన్న వర్షానికే నగరంలోని అత్యంత రద్దీ గల అమీర్‌పేట్‌, మధురానగర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, పంజాగుట్ట పరిసర ప్రాంతాలు నీట మునిగేవని, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో హైడ్రా రంగంలోకి దిగి ఆ ముప్పును తొలగించిందని స్థానికులు గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వారం రోజుల్లోనే వరద సమస్యను పరిష్కరించడం అద్భుతమైన పరిణామనని కొనియాడారు. కొంతమంది కబ్జారాయుళ్లు, వారికి సహకరించే నాయకుల ఆగడాలకు హైడ్రా అడ్డుపడుతుందనే ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న హైడ్రా ఏర్పాటు నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలోనే హైడ్రా కార్యక్రమాలు కొనసాగాలని, ఆయన నిజాయితీకి హాట్సాఫ్‌ అంటూ నినాదాలు చేశారు. కాగా, ఇటీవల హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, ఈ ప్రజా ర్యాలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News