పండుగ శోభను సంతరించుకున్న కలెక్టరేట్ ప్రాంగణం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, (తెలుగుప్రభ) : మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డిఆర్డిఓ), జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా ఉద్యానవన శాఖతో పాటు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కలెక్టరేట్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ మహిళల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటపాటలు, నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతీమణి రాధా, డిప్యూటీ కలెక్టర్లు మోక్షిత, బరీరా ఫరీద్, లా ఆఫీసర్ చంద్రావతి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఝాన్సీరాణి, జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖాధికారి పద్మజ, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, ఎస్టీఓ అలివేలుమంగ తదితరులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆడారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొనడంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, కలెక్టరేట్ మహిళా సిబ్బంది పరస్పర సంతోషాన్ని పంచుకుంటూ బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి వేడుకలను నిర్వహించడం ద్వారా పండుగల ప్రాముఖ్యతను చాటిచెప్పడంతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు అవకాశం కలుగుతుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డిఆర్డిఓ) సాంబశివరావు, జిల్లా సంక్షేమ శాఖాధికారి వినోద్ కుమార్, కలెక్టరేట్ మహిళా సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

