Homeతెలంగాణహైదరాబాద్MMC Meeting: బ్యాక్ లాగ్ ఖాళీలపై ఎంఎంసీ అధికారులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సమావేశం

MMC Meeting: బ్యాక్ లాగ్ ఖాళీలపై ఎంఎంసీ అధికారులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సమావేశం

  • ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం, రోస్టర్ అమలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించాలన్న కమిషన్ చైర్మన్

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉన్న బ్యాక్ లాగ్, రోస్టర్ అమలుపై తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకయ్య, కమిషన్ సభ్యులు మంగళవారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యో గులకు సంబంధించిన రోస్టర్ అమలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, పదోన్నతులు, సబ్‌ప్లాన్ నిధుల వినియోగం, ఉద్యోగ సంక్షేమం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం, పదోన్నతుల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను చైర్మన్ బక్కీ వెంకయ్య ఆదేశించారు. ఉద్యోగుల హక్కులు పరిరక్షించబడేలా ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రోస్టర్ విధానాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని శాఖల్లో సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను అత్యవసర ప్రాతిపదికన భర్తీ చేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగుల పదోన్నతుల్లో రోస్టర్ విధానాన్ని తప్పనిసరిగా పాటించి, అర్హులైన ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం సమర్థవంతంగా వినియోగించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పదోన్నతులు, సర్వీస్ అంశాలకు సంబంధించి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కరించి, వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, వారి సమస్యలను ఎప్పటికప్పు డు గుర్తించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ప్రస్తుతం ఉన్న గ్రూప్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచే ప్రతి పాదనను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉద్యోగుల సంక్షేమం, సామాజిక భద్రత, సేవా నిబద్ధతను మరింత బలోపేతం చేసే దిశగా అవసరమైన అన్ని సంక్షేమ చర్యలను ప్రభుత్వం చేపట్టాలని చైర్మన్ పేర్కొన్నారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఉద్యోగుల హక్కులను పరిరక్షించడంతో పాటు సమర్థవంతమైన పాలనకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. కమిషన్ చైర్మన్, సభ్యులు తెలిపిన విధంగా కమిషన్ ఆదేశాలు పాటిస్తు న్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా లైసన్ ఆఫీసర్‌ను నియమిస్తామని, అన్ని కాంట్రాక్ట్ పనులలో రిజర్వేషన్ పాటిస్తామని తెలిపారు. ఎంఎంసి కార్పొరేషన్ కావడం వలన రోస్టర్ మొదటి నుండి మొదలు పెడతామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, జోనల్ కమిషనర్లు రాధికా గుప్తా, సంచిత్ గంగ్వార్, వికాస్ మహతో, అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, వేణు గోపాల్, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస రావు, కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, చీఫ్ ఫైనాన్సి యల్ అడ్వైసర్ వెంకటేశ్వర్ రావు, యూబిడి డైరెక్టర్ సునంద, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Also Read: Stock markets: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. వరుసగా నాలుగో రోజు లాభాలకు బ్రేక్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News