Homeతెలంగాణహైదరాబాద్MMC Commissioner: పెండింగ్ బిల్డింగ్ అనుమతులపై ఎంఎంసీ కమిషనర్ ఆకస్మిక సమీక్ష

MMC Commissioner: పెండింగ్ బిల్డింగ్ అనుమతులపై ఎంఎంసీ కమిషనర్ ఆకస్మిక సమీక్ష

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ బిల్డింగ్‌ల అనుమతులు, ఆక్యుపెన్సి సర్టిఫికెట్ల జారీ అంశాలపై మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ) కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న బిల్డింగ్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) దరఖాస్తుల స్థితిగతులను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తును కేసుల వారీగా పరిశీలించిన కమిషనర్, ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక, పరిపాలనా కారణాలతో నిలిచిపోయిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బిల్డింగ్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి దరఖాస్తును నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించేలా సమర్థవంతమైన వ్యవస్థను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అనవసర జాప్యం సహించబోమని స్పష్టం చేసిన కమిషనర్, ప్రతి పెండింగ్ కేసును రోజువారీగా పర్యవేక్షిస్తూ పురోగతి నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన పౌర సేవలు అందించడమే మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కమిషనర్, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, అదనపు చీఫ్ సిటీ ప్లానర్ రంజిత్ కుమార్, ఎల్‌ఏఓ సరిత, ఓఎస్‌డీ వసంత, ఏసీపీలు నరేష్, రాంరెడ్డి, భాగ్యలక్ష్మితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Also Read: Accident : షేక్‌పేట్ వద్ద శోకసంద్రం.. అమాయకుడి ప్రాణం తీసిన మైనర్ల వేగం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News