సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హెచ్‌ఎంటీ నగర్, దేవేందర్ నగర్ నాలా, హబ్సిగూడ–తార్నాక ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి గురువారం విస్తృత క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. పారి శుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, నాలా అభివృద్ధి, హరితీకరణ, రహదారుల మరమ్మతులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అంశాలపై సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎంటీ నగర్‌లో స్వచ్ఛ ఆటోల క్యూఆర్ కోడ్ ఆధారిత హాజరు నమోదు విధానం, పారిశుద్ధ్య కార్మికుల ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు నమోదును పరిశీలించిన కమిషనర్ ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయడంతో పాటు ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
యాంటీ లార్వా ఆపరేషన్ పరిశీలన…
హెచ్‌ఎంటీ నగర్ చెరువు, ఎర్ర కుంట చెరువు వద్ద చేపడుతున్న యాంటీ లార్వా ఆపరేషన్స్‌ను సమీక్షించి దోమల ఉత్పత్తి కేంద్రాలను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దుర్గానగర్‌లోని ప్రసాద్ ఆసుపత్రి నుంచి ప్రధాన రహదా రిపై మురుగునీరు విడుదల చే స్తున్న అంశాన్ని గుర్తించి దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదే శించారు. అలాగే ఆ ప్రాంతంలోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్‌ను పూర్తిగా తొలగించాలని సూచించారు.
Also Read: Police : భక్తిప్రపత్తులతో బోనం… లాల్‌దర్వాజా మహంకాళి క్షేత్రంలో ఖాకీల నైవేద్య శోభ!
మహోత్సవం ఏర్పాట్లను సమీక్ష..
సింగం చెరువు తండాలో నిర్వ హించనున్న వన మహోత్సవం ఏర్పాట్లను సమీక్షించిన కమిషనర్ ఎండిపోయిన చెట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు. బండబావి ఎదురుగా ఉన్న నర్సరీని సందర్శించి మొక్కల నాణ్యతను పరిశీలిస్తూ, కార్పొరేషన్ పరిధిలో హరిత కార్యక్రమాలకు అవసరమైన మొక్కలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు మరమ్మతుల పరిశీలన..
హబ్సిగూడ–తార్నాక ప్రధాన రహదారిలో జెట్ ప్యాచర్ యంత్రంతో చేపడుతున్న బీటీ ప్యాచ్ మరమ్మతు పనులను పరిశీలించిన కమిషనర్, వర్షాకాలంలో రహదారులు గుంతలు లేకుండా ఉండేలా మరమ్మతులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం దేవేందర్ నగర్ నాలా స్ట్రెచ్‌ను పరిశీలించిన కమిషనర్, నాలా అభివృద్ధికి సంబంధించి అన్ని శాఖలకు సమగ్ర కార్యా చరణను నిర్దేశించారు. నాలా వెంబడి పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించడం, వ్యర్థాలను వెంటనే తరలించడం, అక్ర మ డంపింగ్‌ను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, డీ-సిల్టింగ్, ఫెన్సింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
వాటర్ డ్రైన్ ప్రతిపాదనలు..
అంబర్‌పేట్ ఎస్‌టీపీ నుంచి నాగోల్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశించిన కమిషనర్ టౌన్ ప్లానింగ్ విభాగానికి నాలా ఆక్రమణలను తొలగించి వాణిజ్య సంస్థల పరిసరాల పరిశుభ్రతను నిర్ధారించాలని సూచించారు. యూబీడీ విభాగానికి నాలా వెంబడి విస్తృతంగా మొక్కలు నాటి హరిత వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
అక్రమ పార్కింగ్ పై చర్యలు…
అలాగే, ట్రాఫిక్ పోలీసులకు నాలా వెంబడి అక్రమంగా పార్కింగ్ చేసిన యజమాని వివరాలు లేని వాహనాలను వెంటనే టోయింగ్ చేసి తొలగించాలని సూచించారు. పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆక్రమణల రహిత నాలా పరిసరాలే ప్రజల భద్రతకు, సుస్థిర పట్టణాభివృద్ధికి పునాది అని కమిషనర్ పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


