సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): సమాజ సేవను వైద్య వృత్తితో మేళవించి వేలాది మందికి ఆరోగ్య భరోసా కల్పిస్తున్న తెలంగాణకు చెందిన యువ వైద్యురాలు డా. ఎన్. కీర్తన యాదవ్‌కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతిష్ఠాత్మక నేషనల్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా ఎంపి కైన 25 మంది వైద్యుల్లో తెలంగాణ నుంచి ఈ గౌరవం అందు కున్న ఏకైక వైద్యురాలిగా ఆమె నిలిచారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం, ఉస్మానియా మెడికల్ కాలేజీలో అనస్థీషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డా. కీర్తన యాదవ్, డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచిత వైద్య శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరీక్షలు, సీపీఆర్ శిక్షణ, మహిళల ఆరోగ్య సంరక్షణ, యువతకు ఆరోగ్య అవగాహన, రక్తదాన శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వేలాది మందికి చేరువయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సీపీఆర్ శిక్షణను సాధారణ ప్రజలకు అందించడం, వైద్య సేవలు అందని ప్రాంతాల్లో ఆరోగ్య చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ సేవలను గుర్తించిన ఐఎంఏ ఆమెను నేషనల్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డుతో సత్కరించింది.
Also Read: Elections : ఓటరు జాబితా నమోదు పక్కాగా జరగాలి – బండ కార్తిక చంద్రారెడ్డి!

