ఉప్పల్ (తెలుగు ప్రభ): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-12లో భాగంగా ఉప్పల్ సబ్ డివిజన్ పోలీసులు విస్తృత తనిఖీ నిర్వహించి బాల బాలికలకు గుర్తించి రక్షించారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఉప్పల్ సబ్ డివిజన్ ఏసిపి వై. వెంకట్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ వై రామలింగారెడ్డి, పర్యవేక్షణలో ఏహెచ్టీయూ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్ ఇంచార్జ్ కే ఇద్దయ్య నేతృత్వంలో రెస్క్యూ బృందం ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్ వంటి కేసులను గుర్తించి, బాలబాలికలను రక్షించడంతో పాటు సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. బాల కార్మికులకు పనిలో నిమగ్నం చేసిన యజమానులపై కేసులు చేసి, బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఎఫ్ఐఆర్లు, 21 జీడీలు, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో 9 ఎఫ్ఐఆర్లు,14 జీడీలు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్లు 5, జీడీలు 6 నమోదయ్యాయి. 80 మంది బాలరు, బాలికలను గుర్తించి రక్షించారు. రక్షింపబడిన బాలబాలికలకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఎదుట హాజరు పరచగా, కేసుల తీవ్రతను బట్టి యజమానులు ఒక్కో బాలుడి పేరిట 18 వేల నుండి 40 వేల వరకు డ్రాఫ్ట్ (డీడీ)రూపంలో కలెక్టర్ కార్యాలయంలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ శాఖతో పాటు బాలల సంక్షేమ విభాగం సమన్వయంతో చేపట్టిన ఈ చర్యలు బాలల భవిష్యత్తు రక్షణకు దోహద పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
Also read: LB Nagar: నాలుగు నిమిషాల్లో స్పందన.. నలుగురి ప్రాణాలు కాపాడిన పోలీసులు


