రాజేంద్రనగర్ (తెలుగు ప్రభ): రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నూటికి నూరు శాతం విజయవంతంగా పూర్తి చేయడంలో రాజకీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో), జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి అర్హత గల ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించేలా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో చొరవ చూపాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం కిస్మత్‌పూర్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు సుమారు 60 శాతం మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓలు) అందజేశారని తెలిపారు. మిగిలిన 40 శాతం మంది ఓటర్లు కూడా గడువు ముగిసేలోపు ఫారాలను పూర్తి చేసి సమర్పించేలా రాజకీయ పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు వివరాల మ్యాపింగ్ ఇంకా పూర్తి చేయని వారు వెంటనే సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రతి ఓటరు సహకారం అవసరమని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సూచనలు చేయగా, వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, విశ్వసనీయంగా కొనసాగేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నత్తి ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Lift accident: లిఫ్ట్ ప్రమాదంలో వివాహిత దుర్మరణం.. నిర్లక్ష్యమే కారణమంటూ ఫిర్యాదు

