Wednesday, February 11, 2026
Homeతెలంగాణహైదరాబాద్Hyderabad: పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ.. ఇంకా వీడని సందిగ్ధత!

Hyderabad: పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ.. ఇంకా వీడని సందిగ్ధత!

Police Commissionerates: హైదరాబాద్‌ నగరంలో పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేందుకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ప్రభుత్వం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను విభజించి.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌ సిటీలుగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో సరిహద్దులు, సిబ్బంది కేటాయింపు వంటి కీలక అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.

- Advertisement -

డీసీపీలకే పరిమితం చేసే అవకాశం: గతంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధి భారీగా ఉండేది. తాజా పునర్విభజనతో మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో సైబరాబాద్ ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి ఉండేవారు. అయితే ఇప్పుడు పరిధి తగ్గడంతో ఆ బాధ్యతలను కేవలం డీసీపీలకే పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గజరావ్ భూపాల్ బదిలీ అయినప్పటికీ.. ఆ స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించకపోవడం ఈ వాదనకు బలాన్నిస్తోంది.

ప్రజాప్రతినిధుల అభ్యంతరాలు: కమిషనరేట్ల సరిహద్దుల విషయంలో ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజేంద్రనగర్‌ను హైదరాబాద్ కమిషనరేట్‌లో విలీనం చేయడంపై స్థానిక ఎమ్మెల్యే స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో, సరిహద్దులను మరోసారి సవరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also read-Hyderabad: హైదరాబాద్ కమిషనరేట్‌లో భారీ ప్రక్షాళన.. 54 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ!

సిబ్బంది కేటాయింపుపై కమిటీ కసరత్తు: సిబ్బంది విభజన, వనరుల సర్దుబాటు కోసం అదనపు డీజీ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాలుగు కమిషనరేట్లకు అవసరమైన మానవ వనరుల ప్రతిపాదనల బాధ్యతను మహేశ్వరం డీసీపీకి అప్పగించారు. ఎగ్జిక్యూటివ్, మినిస్టీరియల్ సిబ్బందితో పాటు హోంగార్డులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఈ కమిటీ పంపిణీ చేయనుంది. ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతమున్న స్థితిని (Status Quo) కొనసాగించాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

కానిస్టేబుళ్లలో ఆందోళన: కొత్త కమిషనరేట్లకు బదిలీ అయితే తమ సీనియారిటీ, సర్వీసు పరిస్థితి ఏమిటన్నది కానిస్టేబుల్ స్థాయి సిబ్బందిని వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. ఈ అంశాలపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాతే ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల బదిలీలు ఉండవచ్చని సమాచారం. వనరుల సర్దుబాటు, రాజకీయ సమీకరణాల మధ్య ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందనేది వేచి చూడాలి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News