Homeతెలంగాణహైదరాబాద్Road Safety: సురక్షిత రహదారులే లక్ష్యం.. ప్రమాణాల నుంచి అమలు వరకు భద్రతే ప్రాధాన్యం

Road Safety: సురక్షిత రహదారులే లక్ష్యం.. ప్రమాణాల నుంచి అమలు వరకు భద్రతే ప్రాధాన్యం

2030 నాటికి ప్రమాద మరణాలు 50 శాతం తగ్గించాలి..
కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి
ఎన్‌హెచ్‌–65పై పెరుగుతున్న ప్రమాదాలు ఆందోళనకరం..
6+2 లేన్ల విస్తరణ పనులు చేపట్టాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -

హైదరాబాద్, (తెలుగుప్రభ): రహదారి భద్రతకు సంబంధించి ప్రమాణాలు, మార్గదర్శకాలు రూపొందించడం మాత్రమే కాకుండా.. వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, అమలు చేసి సురక్షిత రహదారులను నిర్మించడమే లక్ష్యంగా ఉండాలని, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలనే జాతీయ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్‌లోని నర్మద జిల్లా ఎక్తానగర్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో జరుగుతున్న చింతన్ శివిర్‌–2026 రెండో రోజు కార్యక్రమంలో ‘సురక్షిత రహదారుల రూపకల్పన–ప్రమాణాల నుంచి అమలు వరకు’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక సెషన్‌కు మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేశారు.

రహదారి భద్రతను కేవలం ఇంజినీరింగ్ అంశంగా చూడకుండా ప్రత్యేక వృత్తిపరమైన విభాగంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. స్వీడన్‌ ‘విజన్‌ జీరో’, ఆస్ట్రేలియా ‘సేఫ్‌ సిస్టమ్‌’ విధానాలతో పాటు అమెరికా ఫెడరల్‌ హైవే అడ్మినిస్ట్రేషన్‌ అనుసరిస్తున్న భద్రతా విధానాల నుంచి భారత్‌ నేర్చుకోవాల్సి ఉందన్నారు. మానవ తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని రహదారులు, వాహనాలు, వేగ పరిమితులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

స్వతంత్ర భద్రతా నిపుణుల వ్యవస్థ
ప్రాజెక్టుల అమలులో ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ వ్యవస్థలకు అదనంగా స్వతంత్ర రోడ్డు భద్రత నిపుణుల వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. రోడ్డు భద్రత ఆడిట్‌ ఒక్కసారి నిర్వహించి ముగించే ప్రక్రియ కాకుండా.. డిజైన్‌ దశ నుంచి నిర్మాణం, రహదారి ప్రారంభానికి ముందు, ప్రారంభించిన తర్వాత కూడా నిరంతరంగా కొనసాగాలని అన్నారు. కీలక రహదారులు ప్రారంభించే ముందు భద్రతా ప్రమాణాలు పూర్తిగా అమలయ్యాయా లేదా పరిశీలించేందుకు ‘రోడ్డు భద్రత అంబుడ్స్‌మన్‌’ లేదా ప్రత్యేక భద్రతా ప్రాధికార సంస్థ ఏర్పాటుపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

భూసేకరణ, రైట్‌ ఆఫ్‌ వే కీలకం
సురక్షిత రహదారుల నిర్మాణంలో భూసేకరణ, రైట్‌ ఆఫ్‌ వే అందుబాటులో ఉండటం అత్యంత కీలకమని కోమటిరెడ్డి చెప్పారు. సరైన కూడళ్లు, తగిన విజిబిలిటీ, సర్వీస్‌ రోడ్లు, పాదచారుల సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన మేర భూమి అందుబాటులో ఉండాలన్నారు. అనియంత్రిత మీడియన్‌ ఓపెనింగ్స్‌, ఇళ్లకు, వాణిజ్య సంస్థలకు నేరుగా ఇచ్చే యాక్సెస్‌లు, సరిగా డిజైన్‌ చేయని కూడళ్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల మీదుగా వెళ్లే హైవేలపై పాదచారుల క్రాసింగ్‌లు, ఫుట్‌పాత్‌లు, బస్‌బేలు, లైటింగ్‌, సైన్‌బోర్డులు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.

బ్లాక్‌స్పాట్ల గుర్తింపుతో సరిపెట్టొద్దు
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్‌స్పాట్లను గుర్తించడం మాత్రమే పరిష్కారం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి బ్లాక్‌స్పాట్‌కు శాశ్వత ఇంజినీరింగ్‌ పరిష్కారాలు చూపాలని సూచించారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ప్రమాదం జరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టే విధంగా డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

నిర్మాణ నాణ్యతపైనా నిరంతర పర్యవేక్షణ
డిజైన్‌ ఎంత సురక్షితంగా ఉన్నా నిర్మాణ నాణ్యత లోపిస్తే ప్రయోజనం ఉండదన్నారు. క్వాలిటీ అష్యూరెన్స్‌, పర్యవేక్షణ, రోడ్‌ మార్కింగ్స్‌, సైన్‌బోర్డులు, క్రాష్‌ బ్యారియర్లు, డ్రైనేజీ, పేవ్‌మెంట్‌ నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. నిర్మాణ, నిర్వహణ సమయంలో వర్క్‌జోన్‌ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బ్యారికేడింగ్‌, లైటింగ్‌, హెచ్చరిక బోర్డులు, సురక్షిత డైవర్షన్లు ఏర్పాటు చేసి కార్మికులు, వాహనదారుల భద్రతను కాపాడాలని అన్నారు.

సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి
ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌, సీసీటీవీ నిఘా, ప్రమాద గుర్తింపు వ్యవస్థలు, వేగ నియంత్రణ, జీఐఎస్‌ ఆధారిత సేఫ్టీ మ్యాపింగ్‌, డ్రోన్లు, డిజిటల్‌ రోడ్‌ ఇన్వెంటరీ వంటి సాంకేతికతలను విస్తృతంగా వినియోగించాలని మంత్రి సూచించారు. ‘డిజైన్‌లో సేఫ్‌.. నిర్మాణంలో సేఫ్‌.. నిర్వహణలో సేఫ్‌.. రహదారి జీవితకాలమంతా సేఫ్‌’ అనే విధానాన్ని అవలంబించాలన్నారు.

2023లో దేశంలో 1.72 లక్షల ప్రమాద మరణాలు
2023లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 1,72,890 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 23,652, తమిళనాడులో 18,347, మహారాష్ట్రలో 15,366, మధ్యప్రదేశ్‌లో 13,798, కర్ణాటకలో 12,321 మంది మరణించారని వివరించారు. తెలంగాణలో అదే ఏడాది 7,660 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో ఇది 4.4 శాతమని తెలిపారు. దేశంలోని మొదటి పది రాష్ట్రాల్లోనే సుమారు 74 శాతం రోడ్డు ప్రమాద మరణాలు నమోదవుతున్నాయని చెప్పారు.

ఎన్‌హెచ్‌–65పై మంత్రి ఆందోళన
హైదరాబాద్‌–విజయవాడ ఎన్‌హెచ్‌–65పై తరచూ జరుగుతున్న ప్రమాదాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో 17 బ్లాక్‌స్పాట్లను గుర్తించి ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారిపై ట్రాఫిక్‌ భారం విపరీతంగా పెరిగిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 6+2 లేన్లుగా రహదారి విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. త్వరలో కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించి పనులు ప్రారంభమవుతాయని హామీ లభించిందన్నారు. ఈ విస్తరణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

ఐదు అంశాలపై సమిష్టి దృష్టి
చింతన్‌ శివిర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు అంశాలపై సమిష్టిగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.భద్రతకు ప్రాధాన్యమిస్తూ రహదారుల రూపకల్పన, నిర్మాణ దశలోనూ భద్రతకు ప్రాధాన్యం నిర్వహణలో భద్రతను నిర్ధారించడం, డేటా, సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం నిరంతర సమీక్ష ద్వారా భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చడం అనే ఐదు అంశాలపై దృష్టి కేంద్రికరించాలని తెలిపారు. ఎన్ని కిలోమీటర్ల రహదారి నిర్మించామన్నది కాదు.. ఎన్ని ప్రాణాలను కాపాడామన్నదే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులు, సైక్లిస్టులు, ద్విచక్ర వాహనదారులు, హైవేల వెంట నివసించే ప్రజలు సురక్షితంగా ప్రయాణించేలా రహదారులను నిర్మించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.2030 నాటికి ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నిర్మించే ప్రతి కిలోమీటర్‌ రహదారి రాబోయే తరాలకు కూడా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక సీఎస్‌ వికాస్‌రాజ్‌, చీఫ్‌ ఇంజినీర్‌ (జాతీయ రహదారులు) ధర్మారెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌, సీఆర్‌ఐఎఫ్‌) వసంత్‌ నాయక్‌, చీఫ్‌ ఇంజినీర్‌ (స్టేట్‌ రోడ్స్‌, హ్యామ్‌) బి.వెంకటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సెషన్‌లో ప్రత్యేక కార్యదర్శి వినయ్‌కుమార్‌ రాజావత్‌, జాయింట్‌ సెక్రటరీ సీహెచ్‌.సింగ్‌, ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సెక్రటరీ జనరల్‌ రాహుల్‌ గుప్తా, ఐఐటీ కాన్పూర్‌ డీన్‌ ప్రొఫెసర్‌ నితిన్‌ సక్సేనా, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ వెంకటేశ్‌ బాలసుబ్రమణియన్‌, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ డైరెక్టర్‌ (టెక్నికల్‌) అమరేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News