China Manja seized in Hyderabad: సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ ఎంత సరదానిస్తుందో.. ఏ మాత్రం అజాగ్రత్తగా వహించినా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. చైనా మాంజా కారణంగా పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకి శాపంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడిక్కడ కళ్లెం వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు తమ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ను ముమ్మరం చేసి పలువురిని అరెస్ట్ చేశారు.
పతంగుల పండుగ సందర్భంగా చైనా మాంజా కారణంగా ఎలాంటి విషాదకర సంఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తాజాగా, కాలాపత్తర్‌లో నిషేధిత మాంజాను విక్రయిస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహ్మద్ షజైబ్ నుంచి రూ. 6.9 లక్షల విలువైన 345 బాబిన్ల నైలాన్ కోటెడ్ కైట్ స్ట్రింగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత మాంజాను విక్రయిస్తూ పట్టుబడిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.
Also Read: https://teluguprabha.net/gallery/pm-narendra-modi-participated-in-kite-festival-at-gujarat/
కాగా, హైదరాబాద్ పోలీసులు ఇటీవల నగరవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటివరకూ 103 కేసులు నమోదు చేశారు. 143 మందిని అరెస్టు చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న 6,226 బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 1.24 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఇప్పటివరకూ వెలుగులోకి వచ్చిన ప్రమాదాలు..
ఇటీవల హైదరాబాద్‌లో బంజారా హిల్స్ నుంచి రామంతపూర్‌కు బైక్‌పై వెళుతుండగా చైనా మాంజా తగిలి ఓ వ్యక్తి గాయపడటంతో పోలీసులు ఈ నిషేధిత మాంజాపై చర్యలు తీసుకున్నారు. మరో సంఘటనలో గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట వైపు బైక్‌పై వెళుతుండగా, బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ సమీపంలో విరిగిన చైనీస్ గాలిపటం దారం తగిలి గాయపడ్డాడు. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో రైడింగ్ చేస్తుండగా, మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మెడకి మాంజా తగిలి గాయపడ్డాడు.
Also Read: https://teluguprabha.net/lifestyle/morning-drinks-for-healthy-and-energetic-day/
మరోవైపు ఆన్‌లైన్ వేదికగా చైనీస్ మాంజా విక్రయిస్తున్న వారిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రత్యేక బృందాల ద్వారా వారిని ట్రాక్ చేస్తూ పట్టుకుంటున్నారు. గాలిపటాలను ఎగురవేసేందుకు కాటన్ కైట్ థ్రెడ్‌ను మాత్రమే ఉపయోగించాలని సీపీ సూచించారు.

