Homeతెలంగాణహైదరాబాద్Metro : హైదరాబాద్ మెట్రో హంగులపై రైల్వే జీఎం హర్షం.. సమన్వయం దిశగా కీలక...

Metro : హైదరాబాద్ మెట్రో హంగులపై రైల్వే జీఎం హర్షం.. సమన్వయం దిశగా కీలక అడుగులు!

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ) : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) కార్యాలయాన్ని సందర్శించారు. నాగోల్‌లోని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ అడ్మినిస్ట్రేటివ్ భవనంలో మెట్రో ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో ప్రస్తుత నిర్వహణ ప్రమాణాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

- Advertisement -

ఈ కీలక భేటీలో హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ కె.వి.బి. రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చిప్లుంకర్ సహా పలువురు సీనియర్ రైల్వే, మెట్రో అధికారులు పాల్గొన్నారు.

సమగ్ర ప్రజెంటేషన్ – మెట్రో పనితీరుపై చర్చ : సమావేశం ప్రారంభంలో మెట్రో అధికారులు రైల్వే జీఎంకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మెట్రో రైలు వ్యవస్థ సమగ్ర తీరుతెన్నులను వివరించారు. మెట్రో రైళ్ల ఆపరేషన్ విధానం, ప్రయాణికుల రద్దీ, భద్రతా ప్రమాణాలు, ఆదాయ వనరులు ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పట్టికల రూపంలో సమగ్ర సమాచారాన్ని అందించారు.

రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద సమన్వయం : మెట్రో నెట్‌వర్క్ విస్తరణ పనులలో భాగంగా నగరంలోని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల మీదుగా మెట్రో లైన్లను నిర్మించాల్సి ఉంది. ఇటువంటి సున్నితమైన ప్రాంతాల్లో పనులు వేగవంతంగా సాగాలంటే దక్షిణ మధ్య రైల్వే (SCR) నుంచి అనుమతులు, సాంకేతిక సహకారం ఎంతో అవసరమని మెట్రో అధికారులు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే జీఎం, భవిష్యత్తు ప్రాజెక్టులకు తమ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.

ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్, డిపో సందర్శన : సమీక్ష అనంతరం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నాగోల్ మెట్రో మెయింటెనెన్స్ డిపోను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైళ్ల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించే ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (OCC) పనితీరును ఆయన సునిశితంగా గమనించారు. మెట్రో రైళ్ల కదలికలను జీపీఎస్ మరియు ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా ఎలా ట్రాక్ చేస్తారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించడానికి ఉపయోగించే విపత్తు నిర్వహణ ప్రోటోకాల్స్, భద్రతా ప్రమాణాలను అధికారులు ఆయనకు వివరించారు. మెయింటెనెన్స్ షెడ్, కోచ్‌ల తనిఖీ కేంద్రాలు, అత్యాధునిక వీల్ లాథ్ యంత్రాలు, పిట్‌లైన్ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ తదితర నిర్వహణ సదుపాయాల సాంకేతికతను ఆయన అభినందించారు.

పర్యావరణ హితం.. వృక్షారోపణ కార్యక్రమం : పర్యటనలో భాగంగా నాగోల్ మెట్రో డిపో ప్రాంగణంలో రైల్వే  మెట్రో అధికారులు సంయుక్తంగా మొక్కలు నాటారు. మెట్రో ప్రయాణం ఎంత హరిత రవాణావో, పర్యావరణ రక్షణ కోసం తాము తీసుకునే చర్యలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

మెట్రో ప్రమాణాలు అద్భుతం: జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ : పర్యటన ముగింపులో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నడుస్తున్న తీరు, అందులో వాడుతున్న సరికొత్త టెక్నాలజీ ప్రశంసనీయంగా ఉన్నాయని కొనియాడారు. నగర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ వసతులను కల్పిస్తున్న హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్ అండ్ టీ మెట్రో బృందాన్ని అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే  మెట్రో రైలు వ్యవస్థల మధ్య ఇలాంటి పరస్పర సమన్వయం భవిష్యత్తులో హైదరాబాద్ నగర ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News