సికింద్రాబాద్ (తెలుగుప్రభ): రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు సూచించారు. వర్షాల వల్ల నిలిచిపోయిన నీళ్లలో దోమలు విపరీతంగా వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
డెంగ్యూ బారిన పడితే శరీరంలో ప్లేట్‌లెట్లు పడి పోవడమే కాకుండా కంటి వెనుక భాగంలో నొప్పులు, తీవ్రమైన ఎముకల నొప్పులు వస్తాయని, అలాగే మలేరియాలో తీవ్ర జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయని తిరుపతిరావు స్పష్టం చేశారు. జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా, సొంత వైద్యం వైపు వెళ్లకుండా వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించాలని డాక్టర్ తిరుపతిరావు కోరారు.
ప్రస్తుతం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, ఏరియా ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని, ‘టీ-హబ్’ ద్వారా ఉచిత పరీక్షలు, అవసరమైన మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని తిరుపతిరావు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవద్దని ప్రజలకు సూచించారు.
వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కొందరు వాంతులు, విరేచనాలు అవుతున్నాయని నీళ్లు తాగడం మానేస్తున్నారని, అలా చేయడం వల్ల శరీరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడి మూత్ర పిండాలకు రసప్రసరణ తగ్గి తాత్కాలికంగా కిడ్నీలు చెడిపో యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో డయాలసిస్ వరకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అందువల్ల కాచి వడబోసిన మంచినీటిని మాత్రమే తాగాలని సూచించారు.
వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు. నిలిచిన నీటిలో దోమలు వృద్ధి చెందకుండా అబాటే స్ప్రే చేయడం గానీ, లేదా మోటార్ బైక్, ట్రాక్టర్ల నుంచి తీసిన వాడిన ఆయిల్ రెండు చుక్కలు వేయడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చని తెలిపారు. పిల్లలు, వృద్ధులు దోమల బారిన పడకుండా ఉండటానికి దోమతెరలను వాడటం శ్రేయస్కరమని, సరైన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలను డాక్టర్ తిరుపతిరావు కోరారు.

