సికింద్రాబాద్ (తెలుగుప్రభ): రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా జరిగే ఉజ్జయినీ మహంకాళి ఆషాఢ బోనాల జాతరకు సికింద్రాబాద్ సిద్ధమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలకు అధికారులు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం, విద్యుత్, అగ్నిమాపక సేవలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఆదివారం ఉదయం 4 గంటలకు హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.. సతీమణితో కలిసి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో అధికారికంగా జాతర ప్రారంభమవుతుంది. అనంతరం సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
భక్తుల కోసం ఏడు క్యూ లైన్లు..
లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తుండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం మొత్తం ఏడు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. జోగినీలు, బోనం తీసుకొచ్చే మహిళలు నేరుగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు..
జాతర ప్రశాంతంగా జరిగేందుకు నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఆలయ పరిసరాలు, ఊరేగింపు మార్గాలు, ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసులు మోహరించి నిరంతర నిఘా కొనసాగించనున్నారు.
ఫేస్ రికగ్నిషన్ కెమెరాలతో పర్యవేక్షణ….
ఈసారి భద్రతలో భాగంగా ఆధు నిక సాంకేతికతను వినియోగి స్తున్నారు. కీలక ప్రాంతాల్లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన కెమెరాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించనున్నారు.
జాతరకు వచ్చే భక్తుల కోసం 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు…
భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి 175 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రద్దీని బట్టి అవసరమైతే అదనపు సర్వీసులు కూడా అందుబాటులో ఉంచనున్నారు.
రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత….
జాతర సందర్భంగా శాంతిభద్రతల దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఆరు తాగునీటి శిబిరాలు…
వాటర్‌వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఆరు తాగునీటి శిబిరాలను ఏర్పాటు చేశారు. టుబాకో బజార్, జనరల్ బజార్ వెళ్లే దారి, మానేపల్లి జ్యువెలర్స్ సమీపం, అంజలీ థియేటర్, ఆశీర్వాద్ హోటల్, మహంకాళీ పోలీస్ స్టేషన్, రోచా బజార్ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు నిరంతరం అందుబాటులో ఉంచి ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
ఐదు వైద్య శిబిరాలు….
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐదు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది 24 గంటల పాటు సేవలు అందించ నున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు.
మూడు షిఫ్టుల్లో పారిశుద్ధ్య పనులు…
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మూడు షిఫ్టుల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ చేపట్టనున్నారు. 45 మంది ఎస్‌ఎఫ్‌వోలు, 22 మంది సానిటరీ జవాన్లు, 600 నుంచి 700 మంది పారిశుద్ధ్య కార్మికులు 22 మార్గాల్లో నిరంతరం శుభ్రత పనులు నిర్వహిస్తారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తాయి.
టాయిలెట్లు, మొబైల్ సౌకర్యాలు…
భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో సుమారు 20 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం రెండు ప్రత్యేక టాయిలెట్లు, అదనంగా మొబైల్ టాయిలెట్లు కూడా అందుబాటులో ఉంచారు.
విద్యుత్, అగ్నిమాపక శాఖల అప్రమత్తత…
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ 60 మంది సిబ్బందిని ప్రత్యేక విధు ల్లో నియమించింది. విద్యుత్ లోపాలు తలెత్తితే వెంటనే సరిచే సేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయి.అగ్నిమాపక శాఖ మూడు ఫైర్ ఇంజిన్లను కీలక ప్రాంతాల్లో మోహరించింది. అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచింది.

