Homeతెలంగాణహైదరాబాద్Sanitation : ప్రాథమిక వైద్యంలో పడకేసిన పారిశుధ్యం.. 'చెత్త' నిలయంగా శేరిలింగంపల్లి పీహెచ్‌సీ

Sanitation : ప్రాథమిక వైద్యంలో పడకేసిన పారిశుధ్యం.. ‘చెత్త’ నిలయంగా శేరిలింగంపల్లి పీహెచ్‌సీ

శేరిలింగంపల్లి ( తెలుగుప్రభ ) : ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచంగా, ఆపదలో ఆదుకునే సంజీవనిలా నిలవాల్సిన ప్రభుత్వ వైద్యాగారం.. అధికారుల పలచనైపోయిన ఉదాసీనతతో వ్యాధుల పుట్టలా మారితే పరిస్థితి ఏమిటి? సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే (పీహెచ్‌సీ) మురికికూపమై, రోగాల వ్యాప్తికి కేంద్రబిందువుగా తయారైతే పేద రోగుల గత్యంతరమేమిటి? తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగర శివారులోని శేరిలింగంపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుభవిస్తున్న ఈ దయనీయ స్థితి చూస్తే ఎవరికైనా గుండెలు తరుక్కుపోవాల్సిందే. 

- Advertisement -

చెత్తకుప్పగా మారిన పరిసరాలు – మూగబోయిన పారిశుధ్యం : ఆరోగ్య పరిరక్షణకు మార్గదర్శకంగా నిలవాల్సిన శేరిలింగంపల్లి పీహెచ్‌సీ ఆవరణ ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండిపోయింది. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులతో కలిసి శనివారం ఈ కేంద్రాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ అక్కడి అస్తవ్యస్త పరిస్థితులను చూసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణమంతా దుర్గంధం వెదజల్లుతుండటంతో చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సంబంధీకులు ముక్కున వేలేసుకునే పరిస్థితి దాపురించింది. పారిశుధ్య నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేయడంతో పరిసరాలు వ్యాధుల నిలయాలుగా మారాయని ఆయన ధ్వజమెత్తారు.

కలుషిత నీటి సంపు – బొద్దింకలు, వ్యర్థాల మయం : ఆసుపత్రిలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన తాగునీటి సంపు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శుభ్రతకు నోచుకోక అందులో బొద్దింకలు, మురికి, ప్రమాదకర వ్యర్థాలు పేరుకుపోయాయి. రోగులకు శుభ్రమైన తాగునీరు అందించడంలో అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. కనీస పారిశుధ్యం పాటించని ఇటువంటి నీటిని వాడటం వల్ల ఆరోగ్య సంరక్షణ దేవుడెరుగు, కొత్త రోగాలు సంక్రమించే ప్రమాదం పొంచి ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

రెండేళ్లుగా నిలిచిన బోర్‌వెల్ – నరకప్రాయంగా మారిన మరుగుదొడ్లు : గత రెండు సంవత్సరాలుగా పీహెచ్‌సీలోని బోర్‌వెల్ పనిచేయకపోయినా.. దానికి మరమ్మతులు చేయించలేని అచేతన స్థితిలో ప్రభుత్వం ఉందనడం సిగ్గుచేటని నరేందర్ యాదవ్ దుయ్యబట్టారు. నీటి సదుపాయం లేకపోవడంతో ఆసుపత్రిలోని మరుగుదొడ్లు అశుభ్రంగా మారి, తీవ్రమైన దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. నీరు లేక రోగులతో పాటు విధులు నిర్వహించే వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది కూడా మరుగుదొడ్లను ఉపయోగించుకోలేని దుస్థితి నెలకొంది. కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

మందుబాబుల అడ్డా’గా మారిన గార్డెన్ ఆవరణ : రోగులకు ప్రశాంతతను అందించాల్సిన ఆసుపత్రి గార్డెన్ ప్రాంతం ప్రస్తుతం వ్యర్థాలు, ఖాళీ మద్యం సీసాలతో నిండిపోయింది. రాత్రివేళల్లో ఈ సేవాలయాన్ని మందుబాబులు తమ అడ్డాగా మార్చుకున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన వైద్యాలయం అస సాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నా స్థానిక యంత్రాంగం నిద్రపోతోందా అని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి హెచ్చరిక – యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదని, తక్షణమే ఈ పరిస్థితి మారాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

తక్షణ డిమాండ్లు: ఆరోగ్య కేంద్రం పరిసరాలను వెంటనే సమగ్రంగా పరిశుభ్రం చేయాలి.
నీటి సంపును శుద్ధి చేసి, శుభ్రమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలి. పనిచేయని బోర్‌వెల్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించి నీటి వసతిని పునరుద్ధరించాలి.
మరుగుదొడ్లలో నీటి సౌకర్యం, పారిశుద్ధ్య వసతులు కల్పించాలి.

ఆందోళన చేపడుతాం : స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత వైద్యాధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించకపోతే, ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పొట్ట నరేందర్ యాదవ్ హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు క్రిష్ణ యాదవ్, కె. రాములు, వాకిటి శంకర్, నర్సింహారెడ్డి, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News