Son Robbery at Home: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు. ఎందుకంటే ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే మొదటగా బయటవాళ్లపైన అనుమానం వస్తుంది కానీ.. కుటుంబీకులపైన సందేహం రాదు. ఆ నమ్మకమే ఈ తల్లిదండ్రుల కొంపముంచింది. జల్సాల బారిన పడిన కొడుక్కి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించలేదు. చివరికి చేతులు కాలాక కానీ.. అసలు దొంగను గుర్తించలేకపోయారు. జల్సాల బారిన పడి సొంత ఇంట్లోనే రూ. లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అది కూడా స్నేహితుల సాయంతో ఈ దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో జల్సాల కోసం సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు కుమారుడు, అతని ఇద్దరు స్నేహితులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ రహమత్ షరీఫ్ కుమారుడు అద్నాన్ షరీఫ్ కొంతకాలంగా చెడు వ్యసనాల బారిన పడ్డాడు. వాటి కోసం తన తల్లి, సోదరికి సంబంధించిన సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను అద్నాన్ తన స్నేహితులతో కలిసి నాలుగు విడతలుగా చోరీ చేశాడు.
చోరీ చేసిన బంగారంతో అద్నాన్, అతని స్నేహితులు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావించారు. కొంత బంగారం అమ్మగా వచ్చిన డబ్బుతో నిందితులు ఒక వెర్నా కారు, రెండు ఐఫోన్‌లు, వన్‌ప్లస్, రియల్‌మీ ఫోన్‌లను కొనుగోలు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/rain-alert-for-telangana-with-thunderstorms-and-lightning/
ఇంట్లో బంగారం పోయిందని గమనించిన మహ్మద్ రహమత్.. మార్చి 31న కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అద్నాన్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అద్నాన్‌తో పాటు అతని ముగ్గురు స్నేహితులను శుక్రవారం అరెస్ట్ చేసి వారి నుంచి 13.7 తులాల బంగారం, వారు కొనుగోలు చేసిన కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.

