- రైల్వే ట్రాక్ ఆక్యుపెన్సీ విశ్లేషణకు అత్యాధునిక సాఫ్ట్‌వేర్ అభివృద్ధి
సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): దక్షిణ మధ్య రైల్వే ఇండి యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై మధ్య రైల్వే యార్డులు, జంక్షన్ల సామర్థ్యం, రద్దీ విశ్లేషణ కోసం బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రైల్వే భద్రత పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచే ఆధునిక విశ్లేషణ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ డి.అంజనేయులు రెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా. ఆర్. గోపాలకృష్ణన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐఐటీ బాంబే ప్రొఫెసర్ మిలింద్ సోహోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
గత రెండేళ్లుగా పరిశోధనలు…
గత రెండేళ్లుగా ఐఐటీ బాంబే బృందం యార్డ్ డయాగ్రామ్‌లు, ట్రైన్ పొడవు, వేగం, యాక్సిలరేషన్, ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలు, డేటా లాగర్ సమాచారం ఆధారంగా పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ ఒప్పందంతో ఆ భాగస్వామ్యానికి అధికారిక రూపం లభించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద రైల్వే డేటా లాగర్‌ల నుంచి వచ్చే భారీ స్థాయి సిగ్నలింగ్ డేటాను విశ్లేషించి, రైళ్ల కదలి కలు, నిలిపివేతలు, క్రాసింగ్‌లు, షంటింగ్ వంటి కార్యకలాపాలను సులభంగా అర్థమయ్యే విధంగా చూపించే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ విశ్లేషణలతో రైళ్ల ఆలస్యాలకు కారణాలను గుర్తించడం, రద్దీని తగ్గించడం, రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, భద్రత పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టును దశల వారీగా అమలు చేస్తారు. తొలి దశలో డేటా ధృవీకరణ, రైళ్ల కదలికల విశ్లేషణ, విజువలైజేషన్ టూల్స్, భద్రత-సామర్థ్య సూచికల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. అనంతరం పెద్ద స్టేషన్ యార్డులకు విస్తరించి, రియల్‌టైమ్ సిగ్నలింగ్ వ్యవస్థలతో అనుసంధానం చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
Also read: Hostel : గోరంట్ల బీసీ హాస్టల్లో ‘ఆకలి’ కేకలు.. వార్డెన్‌పై వేటుకు డిమాండ్
యార్డుల విస్తరణ సులభం.. జనరల్ మేనేజర్
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లా డుతూ, రైల్వే ట్రాఫిక్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో యార్డుల విస్తరణకు పరిమిత అవకాశాలే ఉన్నాయని తెలిపారు. అందువల్ల ప్రతి పెట్టుబడి శాస్త్రీయ విశ్లేషణ, ఇంజినీరింగ్ ఆధారంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐటీ బాంబేతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా యార్డుల రూపకల్పన, ఇంటర్‌లాకింగ్ విధానాల్లో చిన్న మార్పుల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, అందుబాటులో ఉన్న రైల్వే వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

