Special Handloom Expo in Ameerpet: భాగ్యనగరంలో చేనేత కళా వైభవ ప్రదర్శన ప్రారంభమైంది. పోచంపల్లి ఇకత్ చీరల నుంచి ఉత్తరప్రదేశ్ బనారసి చీరల వరకు భారతీయ వస్త్ర వెరైటీలను ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 4 వరకు కొనసాగే ఈ ఎక్స్‌పోను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

భారతీయ చేనేత కళ గొప్ప వైభవాన్ని ప్రదర్శిస్తూ, అమీర్‌పేట కమ్మ సంఘం ప్రాంగణంలో “స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో” నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్‌పోను ముఖ్య అతిథి ఇకత్ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్ ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. అందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది. ఇరవై మూడు రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు ఈ ఎగ్జిబిషన్‌లో తమ అద్భుతమైన సృష్టిని ప్రదర్శించారు. ఎక్స్‌పో ఫిబ్రవరి 4 వరకు కొనసాగుతుంది.
సాంప్రదాయ కళ, చేతి వృత్తులను పండుగలా జరుపుకోవడం చేనేత వర్గాలకు సాధికారత కల్పించడంలో అమూల్యమైన పాత్ర పోషిస్తుందని రష్మీ ఠాకూర్ అన్నారు. ఈ కార్యక్రమం నేత కార్మికులకు మద్దతు ఇవ్వడమే కాకుండా సందర్శకులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. చేనేత ఉత్సవం ఇరవై మూడు రాష్ట్రాల నుంచి చేతివృత్తులవారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుతమైన చీరలు, వస్త్రాలను ప్రదర్శిస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ నుంచి బనారసి చీరలు, ఆంధ్రప్రదేశ్ నుంచి కలంకారి, కాటన్ బుట్టా చీరలు, గుజరాత్ నుంచి పటోలా చీరలు, మధ్యప్రదేశ్ నుంచి చందేరి చీరలు, మహారాష్ట్ర నుంచి పైథాని చీరలు, తెలంగాణ నుంటి పోచంపల్లి ఇకత్ చీరల కోసం సందర్శకులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారని రష్మి తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా, జౌళి మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధిపతి డాక్టర్ ఎస్. అరుణ్ కుమార్ మాట్లాడారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం చాలా అవసరం అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఎక్స్‌పోను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.
‘స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో’ అద్భుతమైన ప్రదర్శనలకు మించి, సందర్శకులను నేరుగా నేత కార్మికులతో అనుసంధానించడానికి, స్థిరమైన ఫ్యాషన్‌ను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. భారతదేశ వస్త్ర సంప్రదాయాల పట్ల ప్రశంసలను పెంపొందించడానికి ఒక డైనమిక్ వేదికగా పనిచేస్తుంది.

