గండిపేట్ (తెలుగు ప్రభ): పోలీసు విధుల్లో న్యాయ పరిజ్ఞానం కీలకం. చట్టాలపై పట్టు, దర్యాప్తులో న్యాయపరమైన అవగాహన, న్యాయ ప్రక్రియలపై స్పష్టత పోలీసు వ్యవస్థ పనితీరును మరింత సమర్థవంతం చేస్తాయి. ఈ లక్ష్యంతో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. పోలీసు అధికారులకు న్యాయపరమైన అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించడంతోపాటు, వారి వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా ఈ భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీ ఏకశిల భవనంలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఐపీఎస్, నల్సార్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీకృష్ణ దేవరావు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. పోలీసు శిక్షణలో న్యాయ విద్యకు మరింత ప్రాధాన్యం కల్పించడం, చట్టాల అమలులో అధికారుల అవగాహనను విస్తృతం చేయడం ఈ ఒప్పందంలోని ప్రధాన లక్ష్యాలు. ఇందులో భాగంగా పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఇండక్షన్ ట్రైనీ ఆఫీసర్లకు చట్టాలు, న్యాయపరమైన అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించేలా కార్యక్రమాలను రూపొందించనున్నారు. సంబంధిత కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి న్యాయ విద్యకు సంబంధించిన సర్టిఫికెట్ అందించే విధంగా కార్యాచరణ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుత నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, చట్టాల అమలు, న్యాయస్థానాల ప్రక్రియలు వంటి అంశాల్లో పోలీసు అధికారులు మరింత నైపుణ్యం సాధించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుంది. చట్టపరమైన నిబంధనలపై స్పష్టత పెరగడం ద్వారా విధుల నిర్వహణలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడంతోపాటు, న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. పోలీసు శిక్షణకు న్యాయ విద్యను అనుసంధానించడం ద్వారా అధికారుల వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడం, చట్టబద్ధమైన విధుల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.
కార్యక్రమంలో నల్సార్ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ బాలకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్లు కవిత, వెంకటేశ్వర్లు, కేఆర్‌కే ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్లు, డీఎస్పీలు, న్యాయ అధ్యాపకురాలు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

