HomeTop StoriesLashkar Bonalu: లష్కర్ బోనాలతో ఆధ్యాత్మిక శోభ.. కన్నులపండువగా అంబారీ ఊరేగింపు

Lashkar Bonalu: లష్కర్ బోనాలతో ఆధ్యాత్మిక శోభ.. కన్నులపండువగా అంబారీ ఊరేగింపు

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతర అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభ నడుమ ముగిసింది. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ జాతరతో లష్కర్ ప్రాంతమంతా పండగ వాతావరణం సంతరించుకోగా, రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా దేవాలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ మహానగరం నుంచే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉదయం నుంచే తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పోతరాజుల భీకర నృత్యాలు, తోట్ల ఊరేగింపులు, డిజేల హోరు, భజంత్రీలు, జానపద జాతర పాటల నడుమ యువత చేసిన చిందులు ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విద్యుత్ దీపాలతో రంగురంగుల్లో ముస్తాబైన ఫలహారపు బండ్ల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రెజిమెంటల్ బజార్, శివాజీనగర్, చాపలబాయి, జనరల్ బజార్, కళాసిగూడ, పాన్ బజార్ల నుంచి వచ్చిన ఫలహారపు బండ్లు ఊరేగింపుగా ఉజ్జయిని వైపు తరలివచ్చాయి. సోమవారం ఉదయం రంగం భవిష్యవాణి కార్యక్రమం పూర్తయిన అనంతరం అమ్మవారి అంబారీ ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి బ్యాండ్ బాజాల మోతలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి, అనంతరం మెట్టుగూడ ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంబారీపై అమ్మవారి చిత్రపటం ఊరేగింపు ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై సుభాష్ రోడ్డు, ఆల్ఫా హోటల్ , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా మెట్టు కూడా కొరకు సాగింది. ఇక్కడ అమ్మవారి చిత్రపటాలను ఆలయంలో భద్రపరిచి అనంతరం అంబారి తిరిగి మూడు గంటలకు మహంకాళి ఆలయానికి చేరుకుంది.దారి పొడవునా భక్తులు హారతులు పడుతూ అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ పవిత్ర మహోత్సవంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కోట నీలిమ తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించగా, పోలీసులు నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగిస్తూ కట్టుదిట్టమైన భద్రతను అందించారు.

- Advertisement -

Also read: EO Gutta Manohar Reddy: జాతరను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు.. ఈవో గుత్తా మనోహర్ రెడ్డి

ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం..

ఆదివారం 6 క్యూలైన్లు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు, సోమవారం రద్దీకి తగ్గట్లుగా 4 ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులకు శీఘ్ర దర్శన సౌకర్యాన్ని కల్పించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయగా, జలమండలి అధికారులు ఉచితంగా మంచినీటిని అందుబాటులో ఉంచారు. దక్కన్ మానవ సేవా సమితి, ముక్తా ఫౌండేషన్ తదితర స్వచ్ఛంద సంస్థలు ప్రసాదాల పంపిణీతో పాటు బాటా చౌరస్తా మార్గంలో షెడ్లను ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందించాయి. జాతర అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగియడం పట్ల దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. జాతర విజయం కోసం శ్రమించిన పోలీసు శాఖ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు మరియు మీడియా ప్రతినిధులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పించామని, భక్తులు కూడా ఎంతో ఓపికతో సహకరించారని అధికారులు కొనియాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News