చార్మినార్ (తెలుగుప్రభ): భక్తుల పాలిటి కొంగు బంగారంగా మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం విరాజిల్లుతుంది. తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరిగే పాతనగర బోనాల ఉత్సవాలు మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 217వ వార్షిక బోనాల ఉత్సవాలలో భాగంగా ఈసారి లోకకళ్యాణార్థం 24 రోజుల పాటు జరుగనున్న శ్రీ రుద్ర సహిత త్రిశతచండీ మహాయాగాన్ని గత జూలై 17వ తేదీన హంపి పీఠాధిపతులు శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా ధ్వజా రోహణం చేసి యాగాన్ని ప్రారంభించారు. 24 రోజుల పాటు మహాయాగం జరుగనుంది. గత జూలై 31వ తేదీన అంగరంగ వైభవంగా అమ్మవారికి అభిషేకంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వ తేదీన బోనాల సమర్పణ, 10వ తేదీన ఘటాల ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.
Also Read: Ameenpur: న్యాయం చేస్తానని నరకం చూపించాడు.. అమీన్ పూర్ మాజీ సీఐపై తీవ్ర ఆరోపణలు
రెండు శతబ్దాల చరిత్ర గల మీరాలంమండి మహంకాళి దేవాలయం..
భక్తుల పాలిటి కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పాతబస్తీలోని మహంకాళి దేవాలయాలు విరాజిల్లుతున్నాయి. ఈసారి బోనాల ఉత్సవాలకు సర్వం సిద్దమయింది. చల్లటి తల్లిగా కల్పవల్లిగా ఆరాధ్యదైవంగా పాతబస్తీ మీరాలంమండి భక్తుల మనసులో చెదరని ముద్ర వేసుకుంది. పాతబస్తీలో మతసామరస్యాన్ని కాపాడుతూ.. ప్రజలకు సుఖ సంతోషాలు అందించే ఆదిశక్తిగా కొలువుదీరిన మీరాలం మండి మహంకాళి దేవాలయానికి ఎంతో ఘన చరిత్ర కలిగి ఉంది. 1805 నుంచి నిజాంకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు కూరగాయలు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా మీరాలం మండి ప్రసిద్ది చెందింది. రంగారెడ్డి జిల్లాతో పాటు పరిసర జిల్లాలకు చెందిన రైతులు తమ కూరగాయలను ఎడ్లబండ్లపై మీరాలం మండికి తీసుకువచ్చేవారు. ఇలా మీరాలంమండికి కూరగాయలను తీసుకువచ్చిన రైతులు తమ ఎడ్ల బండ్లను బండిఖానలో నిలిపేవారు. ఆ కాలంలో అకాల వర్షాల కారణంగా పాడిపంటల నష్టంతో పశువులకు అంతుచిక్కని వ్యాధులు సోకాయి. దీనితో బండి ఖానలో 1809లో కొంత మంది రైతులతో పాటు స్థానిక వ్యాపారులు ఒక రావి మొక్కను నాటి దాని ముందు ఒక గూటిలోని దిమ్మె వద్ద అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్దిగా పండాలని వ్యాపారాలు సక్రమంగా జరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఇక్కడి అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించారు. 1908లో మూసికి వరదలు వచ్చినప్పడు అపార నష్టం జరిగిన వేళ మీరాలంమండి స్థానిక వ్యాపార వేత్తలు, రైతులు అమ్మవారికి చాటలో పసుపు, కుంకుమ, ముత్యాలు, పట్టువస్త్రాలు సమర్పించడంతో వరదలు తగ్గుముఖం పట్టాయని పూర్వీకులు చెబుతుంటారు. 1985లో ఆలయకమిటీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆలయం దినదినమానంగా అభివృద్ది చెందింది. 2016 లో ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ప్రతి ఆశాడ మాసంలో 11 రోజుల పాటు బోనాల ఉత్సవాలలో లక్ష కుంకుమార్చన, లక్ష బిల్వార్చన, లక్ష పుష్పార్చన, చండీహోమం అత్యంతవైభవంగా నిర్వహించడం మొదలుపెట్టారు. బోనాల జాతర ఉత్సవాలలో మీరాలం మండి నుంచి బయలుదేరే బ్రహ్మాండమైన బోనాల ఊరేగింపు భాగ్యనగర్ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఆగస్టు 9,10వ తేదీల్లో బోనాలు
ఎంతో ఘన చరిత్ర కలిగిన మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర స్వామి దేవాలయంలో ఆగస్టు 9వ తేదీన బోనాలు, 10 వతేదీన సామూహిక అమ్మవారి ఘటాల ఊరేగింపుకు భారీ సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. ఈ నెల 8వ తేదీన శాంతి కళ్యాణం, పూలంగి సేవ, (పుష్పాలంకరణ) లక్ష పుష్పాలతో అమ్మవారికి అర్చన , 9వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, 10 వ తేదీన రంగం (భవిష్యవాణి) అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయని గాజుల అంజయ్య పేర్కొన్నారు.

