ఖైరతాబాద్(తెలుగు ప్రభ): ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని మకుట డెవలపర్స్ వ్యవస్థాపకులు జార్జ్ కొప్పలి తెలిపారు. సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ (SJGC) ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ప్రతిభా సమ్మేళనం– 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వార్షిక సమాహారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారి భవిష్యత్ అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. మకుట డెవలపర్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ జార్జ్ కొప్పలి మాట్లాడుతూ… ఎస్జీజీసీ నుంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గుర్తింపుగా రూ.5 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు వారి ఉన్నత విద్యకు అవసరమైన సహకారం అందించేందుకు ఈ నిధిని వినియోగించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు సాధించిన విజయాలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, సమాజానికి ఉపయోగపడేలా మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ఎస్జీజీసీతో కలిసి విద్యార్థుల ప్రయోజనాల కోసం భవిష్యత్‌లోనూ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మకుట డెవలపర్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని, సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక కార్యక్రమాలకు సహకరిస్తోందని నిర్వాహకులు తెలిపారు. 2006లో ప్రారంభమైన ఈ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అభివృద్ధి చెందుతూ వస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్. సూర్యప్రకాష్ రావు, మోర భూపాల్ రెడ్డి, చీల రాము, ఎం. రాజా రఘువీర్, కొండచారి తదితరులు పాల్గొన్నారు.


