Homeతెలంగాణహైదరాబాద్Inspection : దివ్యమైన భవితకు భరోసా... దివ్యాంగుల వసతి గృహంలో మంత్రి అడ్లూరి ఆకస్మిక తనిఖీ!

Inspection : దివ్యమైన భవితకు భరోసా… దివ్యాంగుల వసతి గృహంలో మంత్రి అడ్లూరి ఆకస్మిక తనిఖీ!

హైదరాబాద్ సిటీబ్యూరో (తెలుగుప్రభ): రెక్కలున్నా ఎగరలేని పక్షుల్లా… నోరైనా తెరిచి తమ గోడును చెప్పుకోలేని మూగ హృదయాలు ఆ పాఠశాలలో ఎన్నో ఉన్నాయి. కళ్లలోనే కొండంత ఆశలను మోస్తూ, కేవలం సంకేతాల ద్వారానే బాహ్య ప్రపంచంతో సంభాషించే ఆ దివ్యాంగ చిన్నారుల వద్దకు స్వయంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గురువారం నాడు హఠాత్తుగా చేరుకున్నారు. నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం, ప్రభుత్వ వసతి గృహం, పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఆ చిన్నారులతో నేరుగా మమేకమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మూగ-చెవిటి విద్యార్థులు తమ సమస్యలను సంకేతాల ద్వారా చెబుతుంటే మంత్రి ఎంతో మానవీయ కోణంలో శ్రద్ధగా ఆలకించారు. 

- Advertisement -

సంకేత భాషలోనే గోడు విన్నవించిన విద్యార్థులు… స్పందించిన మంత్రి : నల్లగొండ ఎక్స్‌రోడ్స్ పరిధిలోని దివ్యాంగుల ప్రభుత్వ వసతి గృహం, పాఠశాల ప్రాంగణంలోకి గురువారం ప్రవేశించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నేరుగా విద్యార్థుల గదుల్లోకి వెళ్లి వారితో మాట్లాడారు. మూగ, చెవిటి పిల్లలు తాము పడుతున్న ఇబ్బందులను తమ మూగ భాషలోనే సంకేతాల రూపంలో మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. ఆ సంకేతాలను శ్రద్ధగా గమనించిన మంత్రి, వాటి వెనుక ఉన్న కష్టాలను తెలుసుకుని కరిగిపోయారు.

సదుపాయాలు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు తక్షణమే పరిష్కారాలు చూపాలని అధికారులను ఆదేశించారు. అలాగే, వసతి గృహంలోని విద్యార్థులందరికీ అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను సమకూరుస్తామని వారికి మంత్రి స్వయంగా హామీ ఇచ్చారు.

కీలక ప్రతిపాదనలకు చకచకా ఆదేశాలు : తనిఖీ సందర్భంగా వసతి గృహం, పాఠశాలలో సిబ్బంది మరియు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నట్లు మంత్రి గమనించారు. ఈ కొరత కారణంగా విద్యార్థులు విద్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన గంభీరంగా పరిగణించారు.

ఉపాధ్యాయ ఖాళీల భర్తీ: పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను, అవసరమైన ప్రత్యేక బోధనా సిబ్బందికి సంబంధించిన సమగ్ర నివేదికను వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని విద్యాసంస్థ ప్రిన్సిపాల్, సహాయ సంచాలకుడికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల రోజువారీ అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా పంపాల్సిందిగా కోరారు.

ఆరోగ్యం – పారిశుద్ధ్యం: భోజన నాణ్యత, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్ల పారిశుద్ధ్యం, అలాగే కాలానుగుణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. దివ్యాంగుల విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రతతో పాటు స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News