Homeతెలంగాణహైదరాబాద్Tension in Meerpet: మీర్ పేట్‌లో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

Tension in Meerpet: మీర్ పేట్‌లో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

  • కారు అద్దం ధ్వంసంతో తలెత్తిన వివాదం.. పరస్పర దాడులు
  • పలు బైక్ లు, కార్లు ధ్వంసం, నలుగురికి తీవ్ర గాయాలు
  • ఒకరిపై వేడి వేడి తేనెతో దాడి చేసిన బీహారీలు
  • మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

బడంగ్ పేట్ (తెలుగు ప్రభ): కారు అద్దం ధ్వంసంతో మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానలా మారి రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణకు దారితీసిన ఘటన బుధవారం అర్థరాత్రి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. రెండు వర్గాలు పరస్పరం కర్రెలతో తీవ్రంగా దాడులు చేసుకున్నారు. మీర్ పేట్‌కు చెందిన యశ్వంత్‌పై బీహారీలు వేడివేడి తేనెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో రెండువర్గాలకు చెందిన మరో నలుగురికి తలలు పగిలి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన సూర్య, భూపేష్‌లు బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రోడ్డుపై పరాచకాలు అడుకుంటూ నందనవనం కాలనీ పక్కనే ఉన్న తమ నివాసప్రాంతానికి నడుచుకుంటూ బయలుదేరారు. మార్గ మధ్యలో నందనవనం కాలనీ వద్దకు చేరుకోగానే వీరిద్దరు ఒకరినొకరు పరస్పరం తోసుకోవడంతో పార్కు చేసి ఉన్న ఒక కారు అద్దం ధ్వంసం అయ్యింది. ఆ శబ్దానికి ఇంటి యజమాని భార్య కవిత బయటికి వచ్చింది. కారు అద్దం ఎందుకు పగులకొట్టారని కవిత బీహార్ యువకులను ప్రశ్నించింది. స్థానికుల జోక్యంతో కారు అద్దం వేయిస్తామని సదరు యువకులు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికే కవిత తన భర్త మధుకు జరిగిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన కవిత భర్త మధు ఇంటికి చేరుకుని మరో 10 నుంచి 15 మంది స్థానికులతో కలిసి నందనవనం కాలనీ పక్కనే బీహారీల నివాస ప్రాంతానికి తరలి వెళ్లారు. అక్కడ రోడ్డుపై ఉన్న కార్లు, బైక్‌లను కర్రెలతో ధ్వంసం చేసుకుంటూ వెళ్లారు. అక్కడ దాదాపు 500 మంది బీహారీలు వివిధ కుల వృత్తులు చేసుకుంటూ నివసిస్తున్నారు. పెద్ద ఎత్తున బయటికి వచ్చిన బీహారీలతో మధు వర్గీయులు గొడవకు దిగారు. ఇరు వర్గాలు కర్రెలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో మధు వర్గంకు చెందిన యశ్వంత్ తలపై వేడి తేనెను పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బీహార్‌కు చెందిన గోవింద్, కరణ్లకు తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటనలో నలుగురికి తలలు పగులగా, మరి కొంతమంది స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరు వర్గాలను మీర్ పేట్ పోలీసులు చెదరగొట్టారు. మధు వర్గీయులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. పరస్పర దాడుల్లో గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం హయత్ నగర్‌లోని నీలాద్రి ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా, వేడి వేడి తేనెతో యశ్వంత్ అనే వ్యక్తిపై బీహారీలు దాడి చేయడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలు తేనెను వేడి చేయాల్సిన అవరం ఏముందని? మధు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. బీహారీలు స్థానికంగా పెద్ద ఎత్తున నకిలీ తేనెను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారని, అందులో భాగంగానే నకిలీ తేనెను వేడి చేస్తున్న తరుణంలోనే తేనె దాడి జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఈ కేసును మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Also Read: Yadadri Temple: యాదాద్రి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు ఈశ్వరమ్మకు ఘన సన్మానం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News