- రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబయిన ఆలయాలు
- లాల్ దర్వాజా బోనాలను ప్రారంభించనున్న నగర పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనార్
- అక్కన్నమాదన్న మహంకాళి బోనాల ఉత్సవాలను ప్రారంభించనున్న దేవాదాయశాఖ డైరెక్టర్ ఎం.హనుమంత్ రావు
చార్మినార్ (తెలుగు ప్రభ): ఆషాడమాసంలో తెలంగాణలోనే ప్రసిద్దిగాంచిన బోనాల పండుగకు ఓల్డ్ సిటీ ముస్తాబయ్యింది. ఇప్పటికే ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుగనున్న లాల్ దర్వాజా 118వ వార్షిక బోనాల నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ధ్వజారోహణ, శిఖర పూజలతో అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ నగర పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఆర్.వి. కర్జన్‌లు అట్టహాసంగా ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ కమిటీ చైర్మెన్ జి. అరవింద్ కుమార్ గౌడ్ దంపతులచే కలశ స్థాపన పూజలు జరుగనున్నాయి. శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ ఎం.హనుమంత్ రావు ప్రారంభించనున్నారు. ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను సూర్యనారాయణ పంతులు ప్రారంభించనున్నారు. గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి, భారత మాత దేవాలయం బోనాల ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ ఎర్మని కైలాష్‌లు గణపతి హోమం, కలుష స్థాపనతో ప్రారంభించనున్నారు. ఆషాడమాసంలో జరిగే బోనాల పండుగకు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం, హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళిదేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళి దేవాలయం, సుల్తాన్షాహి శ్రీ జగదాంబ దేవాలయం, బేళా ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా కోటమైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ కనకదుర్గ ఆలయం, దేవి దేవాలయం, అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, మేకల్బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం అమ్మవారి దేవాలయాలు బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమివ్వనున్నారు. పాతబస్తీలోని 26 ప్రధాన దేవాలయాలలో అమ్మవారికి అభిషేకం, శిఖరపూజ, ధ్వజా రోహణ, కలశస్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పాతబస్తీలోని 26 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 243 ఆలయాలను ఈ సందర్భంగా ఆలయాలను రంగురంగుల విద్యుద్ధీపాలతో అత్యంత శోభాయమానంగా సుందరంగా అలంకరించారు.
Also Read: Dilsukhnagar: దిల్‌సుఖ్‌నగర్ సాయినాథున్ని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు

