GHMC Council Meeting: కాసేపట్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2026-27 జీహెచ్ఎంసీ (GHMC) బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. గతేడాది కంటే రూ. 450 కోట్లు పెంచి రూ. 11,460 కోట్లతో బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
ఆదాయ వ్యయాలపై చర్చ: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నేడు జరిగే కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులకు జరిపిన కేటాయింపులు, ఆదాయ వ్యయాలపై నగర కార్పొరేటర్లు చర్చించనున్నారు. ఇటీవల చేపట్టిన డివిజన్ల పునర్విభజనలో భాగంగా గ్రేటర్ పరిధి 300 డివిజన్లకు పెరిగింది. అధికార వికేంద్రికరణలో భాగంగా పాత జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లను 253 డివిజన్లుగా మార్చారు. అంతేకాకుండా గ్రేటర్‌లో విలీనమైన 27 స్థానిక సంస్థల పరిధిలో 47 డివిజన్లు ఏర్పాటయ్యాయి.
Also read-Air Pollution : విషపుగాలి గుప్పిట్లో భాగ్యనగరం! కాలుష్యంలో చెన్నై, బెంగళూరులను మించిన హైదరాబాద్..
ఇదే చివరి సమావేశం: నేడు జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో పద్దుపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ చర్చలో పాత జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫిషియో సభ్యుల హోదాలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి సమావేశం కావడం విశేషం. ఫిబ్రవరి 10తో వీరి పదవీకాలం పూర్తి కానుంది. అనంతరం జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం ప్రత్యేక కమిషనర్‌ను నియమించి.. పరిపాలనను నిర్వహించాల్సి ఉంటుంది.

