Uppal Stadium: హైదరాబాద్‌లో క్రికెట్ సందడి నెలకొంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా నేడు మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగనున్న మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ఉత్కంఠభరిత పోరు నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రేక్షకుల కోసం కఠినమైన నిబంధనలను జారీ చేశారు.
వీటిని వెంట తెచ్చుకోవద్దు: భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలోకి పలు వస్తువులను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. సెల్ఫీ స్టిక్స్, ఇయర్ ఫోన్ బడ్స్, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు, లాప్‌టాప్‌లు, కెమెరాలను అనుమతి లేదని తెలిపారు. వాటర్ బాటిళ్లు, బయట ఆహార పదార్థాలు, సిగరెట్లు, లైటర్లు, హెల్మెట్లు, బ్యానర్లకు సైతం అనుమతి లేదని పేర్కొన్నారు.స్టేడియం వద్ద వస్తువులను భద్రపరుచుకోవడానికి (Clock Room) ఎలాంటి సౌకర్యం లేదని స్పష్టం చేశారు.
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా: శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల, బయట కలిపి 430 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Also read-IPL: హైదరాబాద్‌లో నేడు ఐపీఎల్ సమరం.. లక్నోతో తలపడనున్న సన్‌రైజర్స్!
ప్రేక్షకులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు: గేట్ల వద్ద రద్దీని నివారించేందుకు మ్యాచ్ ప్రారంభానికి కనీసం మూడు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలి. వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని కోరారు. దీనివల్ల పార్కింగ్ సమస్యలతో పాటు ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవచ్చని సూచించారు.

