BioAsia summit: ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బయో ఏషియా సదస్సు–2026కు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వేదికగా రెండ్రోజులపాటు సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు బయో ఏషియా సదస్సు 23వ ఎడిషన్‌ను ప్రారంభించనున్నారు.
సదస్సు ప్రత్యేకతలు: “టెక్‌బయో అన్‌లీష్‌డ్: ఏఐ, ఆటోమేషన్ – బయాలజీ రివల్యూషన్” (TechBio Unleashed: AI, Automation – Biology Revolution) అనే నినాదంతో ఈ ఏడాది చర్చలు జరగనున్నాయి. దాదాపు 50 దేశాల నుంచి 3,000 మందికి పైగా నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్‌లతో పాటు భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ అజయ్‌కుమార్ సూద్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ డాక్టర్ రాజీవ్‌సింగ్ రఘువంశీ ప్రసంగించనున్నారు.
ప్రపంచ స్థాయి వక్తల భాగస్వామ్యం: ఈ సదస్సులో వైద్య మరియు బయోటెక్నాలజీ రంగాల్లోని దిగ్గజాలు తమ ఆలోచనలను పంచుకోనున్నారు.
- ప్రొఫెసర్ బ్రూస్ ఎల్. లెవిన్: క్యాన్సర్ జీన్ థెరపీ నిపుణులు (యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా).
- డాక్టర్ హోవర్డ్ వై. చాంగ్: అమ్జెన్ (Amgen) సంస్థ సీఎస్‌ఓ.
- డాక్టర్ స్టెఫాన్ మిల్టెనీ: మిల్టెనీ బయోటెక్ వ్యవస్థాపకులు.
- మాడలీన్ రోచ్: సానోఫీ సంస్థ ఈవీపీ.
ప్రత్యేక ఆకర్షణగా “ఫార్మా–బయోటెక్ కాన్‌క్లేవ్”: భారతీయ ఫార్మా రంగ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేసేందుకు ఒక ప్రత్యేక సమావేశంను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దేశీయ దిగ్గజ సంస్థలైన డాక్టర్ రెడ్డీస్, జైడస్, బయోకాన్, సిప్లా వంటి కంపెనీల సీఈఓలు పాల్గొని, నూతన ఆవిష్కరణలు మరియు సవాళ్లపై చర్చించనున్నారు. గ్లోబల్ హెల్త్‌కేర్ రంగంలో హైదరాబాద్ శక్తిసామర్థ్యాలను చాటిచెప్పేలా ఈ 23వ ఎడిషన్ బయో ఏషియా సదస్సు నిలవనుంది.

