Traffic restrictions in Uppal: ఉప్పల్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ సర్కిల్‌లోని వరంగల్ బస్టాప్, యాదగిరిగుట్ట బస్టాప్‌లను నల్లచెరువు కట్ట సమీపానికి మార్చారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఉప్పల్ వద్ద వరంగల్ వైపు వెళ్లే రహదారిని ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలను జీఎస్‌ఐ వద్ద దారి మళ్లించనున్నారు. జీఎస్‌ఐ జంక్షన్ వద్ద బీరప్పగడ్డ మీదుగా ఎన్‌హెచ్-163 మీదకు వాహనాలను డైవర్ట్ చేయనున్నారు.
Also Read: DK Aruna: అవన్నీ పగటి కలలే.. సీఎం రేవంత్‌పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు
ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం ట్రాఫిక్ మళ్లింపు..
అలాగే, వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను మేఫీల్ హోటల్ వద్ద దారి మళ్లించనున్నారు. ఉప్పల్ భగాయత్ మీదుగా నాగోల్ సర్వీస్ రోడ్డు మీదకు వెళ్లి ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలను ఓఆర్‌ఆర్ మీదుగా హయత్‌నగర్‌కు మళ్లిస్తారు. వరంగల్‌కు వెళ్లే భారీ వాహనాలను హయత్‌నగర్, ఓఆర్‌ఆర్ మీదుగా ఘట్‌కేసర్‌కు మళ్లించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ మార్పులు అమల్లో ఉండనున్నాయి.

